తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. తన భిన్నమైన కార్యాచరణ మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు ఆయన బయట వ్యక్తులకు ..ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటూ ఉంటారు. అయితే అది ఆయన చేపట్టాలనుకున్న సంస్కరణలు లేకపోతే.. మరో కీలక నిర్ణయం గురించి అయి ఉంటుంది. రైతులకు ఫోన్ చేసినా… భూ వివాదాల్లో నలిగిపోతున్న వారికి ఫోన్ కలిపి కష్టాలు తెలుసుకున్నా..దానికో అర్థం ఉంటుంది. తాజాగా ఆయన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేస్తున్నారు. కష్టాలు తెలుసుకుంటున్నారు.
ఇటీవల ఉద్యోగుల కోసం కేసీఆర్ కొన్ని ప్రత్యేకమైన తాయిలాలు ప్రకటించారు. అందులో పీఆర్సీ లాంటివి ఇంకా నిర్ణయాల దశకు రాలేదు. అయితే పదోన్నతులు ఇస్తామని చేసిన ప్రకటనను మాత్రం అమల్లోకి తెస్తున్నారు. శాఖల వారీగా ప్రమోషన్లు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో సాధక బాధలను తెలుసుకునేందుకు… ఉద్యోగుల కష్టాలను తెలుసుకునేందుకు కేసీఆర్ ఫోన్ల బాట ఎంచుకున్నారు. పదోన్నతలు పొందిన.. పొందడానికి ప్రయత్నిస్తున్న వారికి ఫోన్లు చేసి.. విశేషాలు కనుక్కుంటున్నారు. హఠాత్తుగా కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ఆ ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తమ కష్టాలను చెప్పుకునే చాన్స్ వచ్చిందని సంతోషపడుతున్నారు.
పదోన్నతుల కోసం.. తాము చేస్తున్న ప్రయత్నాల్లో ముఖ్యంగా లంచాల సమస్య ఎక్కువగా ఉందని అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను కేసీఆర్ ఎలా పరిష్కరిస్తారో కానీ.. పదోన్నతులు ఇవ్వాలన్నా… మంచి పోస్టింగ్ పొందాలన్నా.. లక్షల్లో పై అధికారులకు ముట్టచెప్పాల్సిన దుస్థితి ఎప్పటి నుండో ఉంది. ఈ విషయం కేసీఆర్కు తెలియనిదేం కాదు.. కానీ తొలి సారి ఆయన ఫోన్లు చేసి .. సమస్యలు తెలుసుకున్న సమయంలో.. ఆయన దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి..!