తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఆఫీసు ప్రారంభించి వారం రోజులు అక్కడే ఉంటారని.. రిటైర్డ్ అధికారులు, మేధావులు, రైతు సంఘం నేతలతో చర్చలు జరుపుతారని.. బీఆర్ఎస్ విస్తరణకు పునాదులు వేసి వస్తారని టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. అయితే కేసీఆర్ మూడు రోజుల్లోనే తిరిగి హైదరాబాద్ పయనం అయ్యారు. ఢిల్లీలో ఉన్న రోజుల్లో కేసీఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహంచలేదు. రెండు రోజులు యాగాలు.. ఓ రోజు ప్రారంభోత్సవం.. మరో రోజు.. తెలంగాణ నుంచి వచ్చిన పార్టీ నేతల్ని కలవడంతోనే సరిపోయింది. ఇతర రాష్ట్రాల వారు ఎవరూ కేసీఆర్ ను కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.
బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తర్వాత.. అధికారికంగా ఆఫీసు ప్రారంభించిన తర్వాత జాతీయ మీడియాకు పెద్ద ఎత్తున ఇంటర్యూలు ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఈ విషయంలోనూ చివరికి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల కన్వీనర్లను ప్రకటించాలని అనుకున్నా.. సమర్థులైన నేతలు దొరకకపోవడం.. అనుకున్న వారు ముందుకు రాకపోవడంతో.. ప్రకటన చేయలేదని తెలుస్తోంది. రైతు విభాగానికి మాత్రం అధ్యక్షుడ్ని ప్రకటించారు. జాతీయ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ ను కలిసేందుకు ఇతర రాష్ట్రాల వారీని భారీగా తరలించి ఉన్నట్లయితే ప్రయోజనం ఉండేది.
కానీ.. ఎక్కువగా తెలంగాణ నుంచి వెళ్లిన నేతలే శుభాకాంక్షలు చెప్పారు. వీరంతా పోలోమని ఢిల్లీకి పయనం కావడంతో.. విమానం టిక్కెట్ల రేట్లు ఒక్క సారిగా పెరిగిపోయాయి. అయితే కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పాలంటే.. ఇక్కడే చెప్పొచ్చుగా అన్న వాదన సహజంగానే వినిపిస్తోంది. మరోసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎప్పుడు ఉంటుందో స్పష్టత లేదు. ఓ బహిరంగసభ పెడితే కానీ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లదన్న వాదన వినిపిస్తోంది.ఆ అంశంపై కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశం ఉంది.