దుబ్బాక ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లక్ష మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నానని హరీష్ రావు చెబుతున్నారు. ఆ దిశగా ఆయన తనదైన శైలిలో వ్యూహం రచిస్తున్నారు. అయితే.. గత ఆరేళ్ల పాలనా కాలంలో వ్యతిరేకత టీఆర్ఎస్ వర్గాలను ఇబ్బంది పెడుతోంది. డబుల్ బెడ్ రూం సహా అనేక హామీ ఇంకా.., హామీల్లానే ఉండిపోయాయని.. ప్రజల్లో చర్చ జరుగుతోంది. విపక్షాలు దాన్నే ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో..టీఆర్ఎస్ ఒకింత ఒత్తిడి ఎదుర్కొంటోంది. అందుకే.. ఫైనల్ టచ్.. కేసీఆర్‌తో ఇప్పిస్తే.. ప్రచారం గొప్పఫినిషింగ్కు వచ్చినట్లవుతుందని అంచనా వేస్తున్నారు.
దుబ్బాక ఉపఎన్నికలు అత్యంత కీలకమైనవిగా మారడంతో.. కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గతంలో మూడు అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగాయి. కానీ ఒక్క నారాయణఖేడ్‌లో కేసీఆర్ ప్రచారం చేశారు. పాలేరు, హుజూరాబాద్ ప్రచారంలో పాల్గొనలేదు. కానీ భారీ మెజార్టీలతో గెలిచారు. లక్ష మెజార్టీని సాధించాలంటే.. సీఎం వచ్చి.. మాట్లాడితే బాగుంటుందనేది పార్టీలో కొందరి అభిప్రాయం. కేసీఆర్ అడుగు పెట్టకపోతే.. ఓ వేళ భారీ మెజార్టీ వస్తే.. క్రెడిట్ మొత్తం.. హరీష్ రావుకు పోయే ప్రమాదం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.
గతంలో కేసీఆర్ సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలోని 11 గ్రామాలు ఇప్పుడు దుబ్బాకలో ఉన్నాయి. ఇప్పుడు సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ సైతం దుబ్బాక పక్కనే ఉంటుంది. గడువు ముగిసే చివరి రోజుల్లో కేసీఆర్‌తో బహిరంగసభ పెట్టించాలనే ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ కూడా ుప్రచారం చివరికి వచ్చేటప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది.