గ్రేటర్ హైదరాబద్ ఎన్నికల్లో ఏ మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని.. కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లోనే ప్రచారానికి వెళ్లని కేసీఆర్.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. కేటీఆర్ రోడ్ షోలు చేయాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వారం రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఫినిషింగ్ టచ్‌గా కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున భారీ బహిరంగసభలో ప్రసంగించే ఏర్పాట్లను టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో సభ జరిగే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రమాదకరంగా మారుతూండటం… ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించే ప్రమాదం ఏర్పడటంతో.. కేసీఆర్… చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
గ్రేటర్లో ఎంఐఎంతో సహజంగానే అవగాహన ఉంది. ఎంఐఎంకు కాస్త పోటీ వచ్చే చోట.. హిందూ ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ అభ్యర్థులను నిలుపుతున్నారు. మైనార్టీ ఓట్లు టీఆర్ఎస్కు పడాల్సిన చోట.. ఎంఐఎం అభ్యర్థులను నిలపదు. అదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ గెలిస్తే.. మత కల్లోలాలు జరుగుతాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలే వ్యూహంతో కేసీఆర్ ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్‌లో కూడా దీన్నే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా.. మత విద్వేషాలతో కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ వాసులంతా ఇదే ఆలోచించాలన్నారు.
కేసీఆర్ రాజకీయ ప్రచారం ముక్కుసూటిగా ఉంటుంది. ఆయన నేరుగా ఓట్లు అడగరు. చెప్పాల్సిందంతా చెప్పి… ప్రజలే తేల్చుకోవాలని చాయిస్ ఇస్తారు. ఆ చాయిస్ ప్రజల్ని ఆలోచింప చేస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్.. రాజకీయ సభల్లో ప్రసంగించింది లేదు. ఇప్పుడు.. ఆ అవకాశం వస్తోంది. ఒక్క సభ అయినా.. గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం… రాత మార్చే అవకాశం ఉంటుందని రాజకీయవర్గాల అంచనా. గ్రేటర్ ఎన్నికలు.. రాజకీయాల్ని మలుపు తిప్పే ఎన్నికలు కాబట్టి.. కేసీఆర్ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు.