గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి రోజు… ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించాలనుకుంది. కేసీఆర్తో ప్రచారం చేయించాలనుకుంది. కానీ ఇప్పుడు ఆ ప్రచార సభ గురించి టీఆర్ఎస్ ఎక్కడా పెద్దగా స్పందించడం లేదు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఆ ప్రచారసభ జరుగుతుందా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. కేసీఆర్.. స్వయంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ సందర్భంగా గంటకుపైగా మాట్లాడారు. చెప్పాల్సినదంతా చెప్పారు. అప్పుడే..ఇక కేసీఆర్ ప్రచారం ఉండదన్న చర్చ జరిగింది.
ప్రస్తుతం గ్రేటర్లో పరిస్థితులు టీఆర్ఎస్కు ఏకపక్షంగా లేవు. గతంలో చెప్పినట్లుగా వంద సీట్లు గెలుస్తామన్న ధీమాను నేరుగా వ్యక్తం చేయలేకపోతున్నారు. మేయర్ సీటు తమదేనని మాత్రం చెబుతున్నారు. ఎంఐఎం మద్దతు.. ఎక్స్ అఫీషియో ఓట్ల మద్దతుతో మేయర్ పీఠం దక్కించుకోవచ్చేమో కానీ.. ఓడిపోయారన్న ప్రచారం మాత్రం జరుగుతుంది. గెలవాలంటే… 76 కార్పొరేటర్ సీట్లను గెలుచుకోవాల్సిందే. అయితే పరిస్థితి అంత సులువుగా లేదు. ఓ వైపు వరద బాధితులకు సాయం అందకపోవడానికి తోడు ఎల్ఆర్ఎస్ లాంటి ప్రభుత్వ నిర్ణయాలు.. ప్రజల్ని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. వాటన్నింటినీ కవర్ చేయడానికి ముఖ్యమంత్రి ప్రచారం చేయాల్సిందేనన్న అభిప్రాయం టీఆర్ఎస్ క్యాడర్లో ఉంది.
దుబ్బాక ఉపఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రచారసభ ఉంటుందని అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచన చేయలేదు. చివరికి అక్కడ వెయ్యి ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. కేసీఆర్ ప్రచారసభ నిర్వహించిటనట్లయితే.. దుబ్బాకలో ఫలితం ఖచ్చితంగా టీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చి ఉండేదని నమ్ముతున్నారు. హోరాహోరీగా ఉన్న గ్రేటర్లో అలాంటి తప్పిదం చేయకూడదని.. కేసీఆర్ ప్రచారం చేయాల్సిందేనని కోరుతున్నారు. మరి టీఆర్ఎస్ హైకమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తుందో చూడాలి..!