తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారసభలో వ్యూహాత్మక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఆయన తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతారని అందరూ అనుకున్నారు. శాంతిభద్రతల అంశాన్ని హైలెట్ చేస్తారని అనుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం అందరి అంచనాలను తల కిందులు చేశారు. కేవలం తాను ప్రజలకు ఏం చేశాను.. ఏం చేయబోతానో అన్నదే ప్రధానంగా చెప్పారు. అమలు చేసిన సంక్షేమ పథకాలు.. తెలంగాణ వచ్చిన తర్వాత మారిన పరిస్థితులు..మెరుగు పరిచిన సౌకర్యాలు అన్నింటినీ ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు.
మేనిఫెస్టో సందర్భంగాప్రకటించిన హమీలకు కేసీఆర్ మరిన్ని మెరుగులు అద్దారు. ప్రతి బడ్జెట్లో హైదరాబాద్‌కు 10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వరదల అంశం ప్రధానంగా మారడంతో దానిపైనా వివరణ ఇచ్చారు. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతాలోనూ వరదలొచ్చాయన్నారు. వరదలు చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయి అందుకే ఇంటికి పదివేలు ఇచ్చామన్నారు. ఆరున్నర లక్షల మందికి 650 కోట్లు ఇచ్చాం. ఇంకో 400 కోట్లయినా ఇస్తామని హామీ ఇచ్చారు. అపార్టుమెంట్ల వాసులకూ ఉచిత మంచినీరును కేసీఆర్ ప్రకటించారు.
హామీలు.. చేసిన పనులే కాకుండా.. ప్రజలను ఆలోచించుకోవాలని తనదైన శైలిలో కోరారు. నాయకుల ఆలోచనలు, పనితీరు చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలన్నారు. ఎవరెవరి వైఖరి ఎలా ఉంది అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. మొత్తానికి కేసీఆర్ రాజకీయ ప్రసంగాలంటే.. విపక్ష నేతలపై విరుచుకుపడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో బద్మాష్ బీజేపీ అని విరుచుకుపడ్డారు.కానీ.. ఎల్బీ స్టేడియంసభలో ఆయన బీజేపీ ప్రస్తావన లేకుండానే.. ప్రసంగాన్ని కొనసాగించారు. పూర్తిగా టీఆర్ఎస్ చేసిన పనులను..చేయబోతున్న పనులపైనే ప్రజలకు గుర్తు చేశారు.