తెలంగాణలో ముందస్తు ఎన్నికలు… అదిగో ఇదిగో వచ్చేస్తున్నాయి, అంతా అయిపోయిందన్న రేంజిలో వాతావరణం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ ని ఈ కోణం నుంచే అందరూ చూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి కేసీఆర్ కేవలం పావుగంట సేపు మాత్రమే చర్చించినట్టు సమాచారం. అధికారికంగా చెబుతున్నది ఏంటంటే… రాష్ట్రానికి విదేశీ అప్పులు తెచ్చుకునే వాటాని కొంత పెంచాలనీ, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని… ఈ రెండు అంశాలపై ప్రధానితో చర్చించడానికి వెళ్లారంటున్నారు. నిజానికి, ఆ మధ్య 11 అంశాలతో ప్రధాని దగ్గరకి వెళ్లారు కదా… వాటిలో ఈ రెండూ ఉన్నాయి! సో… ఇప్పుడు వెళ్లింది ముందస్తు ఎన్నికలపై స్పష్టత కోసమే అనడంలో సందేహం లేదు.
సెప్టెంబర్ 2న రాష్ట్రంలో నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభను ఎన్నికల ప్రచార శంఖారావ సభగానే ఉంటుందని తెరాస వర్గాలు అంటున్నాయి. ఆ సభలోనే కొంతమంది అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చని అంటున్నారు! ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు ఆరోజే కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. అయితే, ఢిల్లీ నుంచి స్పష్టత వస్తే తప్ప ముందస్తుపై కేసీఆర్ ఎలాంటి స్పష్టమైన ప్రకటనా చేయలేరనేది వాస్తవం..! ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నది కూడా ఆ స్పష్టత కోసమే…! ప్రధానిని కలిసిన కేసీఆర్.. ముందస్తుకు సిద్ధంగా ఉన్నమని చెప్పినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలతోపాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు సమాచారం. ఇదే అంశమై ప్రధాని కూడా ‘గో అహెడ్’ అన్నట్టుగా తెలుస్తోంది!
అయితే, ఆ నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణకు ఎన్నికలు జరపాలనే నిర్ణయం తీసుకునేది ఎన్నికల కమిషన్ కాబట్టి, బాల్ కేంద్రం కోర్టులో ఉంది కాబట్టి, కేసీఆర్ మంత్రాంగం జరుపుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే, ఒకవేళ ముందస్తుకు సిద్ధపడిపోయి అసెంబ్లీ రద్దు చేసుకుని, ఆ తరువాత ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం వాయిదా వేస్తే… ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తప్ప, ఏమీ చేయలేని స్థితిలోకి కేసీఆర్ వెళ్లిపోతారు! గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇలానే ఓసారి ముందస్తుకు వెళ్లి దెబ్బతిన్నారు. అలాంటి అనుభవం తనకు ఎదురుకాకూడదు కాబట్టే… కేంద్రం చుట్టూ కేసీఆర్ స్పష్టత కోసం చక్కర్లు కొడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా, కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఆయనకి లభిస్తే తప్ప… ముందస్తుపై కేసీఆర్ మాట్లాడే పరిస్థితి లేదు. సెప్టెంబర్ 2 సభలో ప్రకటన ఉంటుందని తెరాస వర్గాలు అంటున్నాయిగానీ… ప్రస్తుతానికి కేసీఆర్ కి దానిపై కూడా స్పష్టత రాలేదనే సమాచారం ఢిల్లీ వర్గాల నుంచి తెలుస్తోంది.