ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సోషల్ ఇంజనీరింగ్ అనకపోయినా కుల ఫార్ములాల ప్రయోగాలు బాగా పెంచేశారు. పై కులాల నుంచి వెనకబడిన వాటి వరకూ రకరకాల వ్యూహాలు సిద్ధం చేశారు. మొదట రెడ్డి వెలమ ఫార్ములా. గతంలో తెలంగాణలో రెడ్ల పాలన నడిచిందని ఇప్పుడు వెలమల ఆధిపత్యం వచ్చేసిందని అనుకుంటారు. కాని అప్పుడు రెడ్ల వెనక వుండి చక్రం తిప్పింది వెలమలే చూడండి అని ఇటీవల ఒక టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధి ఉదాహరణలు చెప్పారు! అలాగే ఇప్పుడు కూడా వారే పెత్తనం చేస్తున్నారు. కాకుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ గనక వెలమలు ఆధిపత్యం వచ్చేసిందంటున్నారంతే. రెడ్లపాత్ర గతం కన్నా తగ్గిందేమీ లేదు. అప్పుడు వాళ్లు ముందు మేము వెనక ఇప్పుడు మేము ముందు వాళ్లు వెనక.. అంతే.. అని ఆ ప్రతినిధి విశదీకరిస్తే ఔరా అనిపించింది.ఈ క్రమంలో కమ్మ వాళ్లను కూడా కలిపేసుకోవడం పెద్ద పనికాదు. రెడ్లను కలుపుకున్నా శక్తియుక్తులు గల వారిని మరీ కీలక స్తానాల్లోకి తీసుకోకూడదు. కాస్త మందకొడిగా లేక విధేయంగా వుండేవారిని చేరదీసి వారికీ ఇచ్చామనిపించాలి. అదీ స్టోరీ.
ఇక బీసీలను ఆకట్టుకోవడోనికి ఒకరోజు చేపలనీ, ఒకరోజు గొర్రెలనీ ప్రకటనలు గుప్పించడంలో చాలా పరమార్థం వుందంటున్నారు. తెలంగాణలో గతంలో మున్నూరు కాపు, గౌడ,యాదవ కులాలు బిసీలైనా బాగా బలం పుంజుకున్నాయి. వాటికి సంబంధించిన నాయకులు ప్రముఖులుగా మారారు. అయితే మరోవైపున కురుమ(అంటే కేవలం గొర్రెలు మేకలే మేపుకునేవారు) ముదిరాజ్(మత్స్యకారులు),నాయీ బ్రాహ్మల వంటి వారు ఉపేక్షకు గురైనారు. వారిపై ఏ కాస్త శ్రద్ద పెట్టినా మనతో వుండిపోతారని కెసిఆర్ వివరించారట.
ఇక ఇవన్నీగాక బ్రాహ్మణులు వుండనే వున్నారు.వారికోసం ఒక పరిషత్ ఏర్పాటు చేయడమే గాక ఆంధ్ర తెలంగాణ తేడాలు కూడా పాటించకుండా సలహాలు సహాయం తీసుకుంటామన్నారు. సంప్రదాయాలను పాటించే కెసిఆర్ స్వతహాగా వీరితో మంచిగా వుండాలనుకుంటారట. పైగా వారివల్ల పెద్ద ప్రమాదం లేదని కొంచెం చేస్తే కొండంత సంతోషపడతారని టిఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యమంత్రికి దగ్గరగా వుండే రమణాచారి జ్వాలా నరసింహరావు, ఎంపి కెప్టెన్కాంతారావు, వేణుగోపాలాచారి వంటివారంతా ఈ క్రతువులో ముందున్నారు.
ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ముస్లింలు ఎస్సిలు ఓటు వేసే సమయానికి ఇతర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని స్పందిస్తారని సంప్రదాయికంగా వారికి కొన్ని రివాజులున్నాయని కెసిఆర్ భావిస్తున్నారు. అందుకే ఎస్సి ఎస్టి సబ్ప్లాన్పైనా ఆయనకు పెద్ద ఆసక్తి లేదు. దాన్ని అటకెక్కించేశారు. అదే బిసిల విషయంలో కొందరిపై కేంద్రీకరిస్తే తప్పక ప్రయోజనాలుంటాయి. గతంలో తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ దాన్ని జయప్రదంగా అమలు చేసి అధికారం చేశారు.ఆయన నీడలో పైకి వచ్చిన కెసిఆర్ కూడా కాస్త మార్పులు చేర్పులతో మరో విధంగా అమలు చేస్తున్నారు. వీటి వల్ల తెలంగాణ గ్రామీణ జీవితంలో ప్రతివారూ తమ చుట్టూ చేరతారని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయాన్ని ఉద్ధరించడం, పట్టణాలలో ఉపాధి కల్పించడం సులభం కాదు గనక పల్లెల్లో కులాల వ్యూహమే మేలని వారు కూడా కన్విన్స్ అయిపోయారు.