పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ పై సమరమేనని వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలు ముగిసి నెల రోజులు అవుతున్నా మౌనం వీడటం లేదు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ నిర్దేశించుకున్న వంద రోజుల గడువు ముగిసిందని, హామీలు అమలు చేసేలా సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్న కేసీఆర్… సర్కార్ విధానాలపై ఆందోళనలు కాదు కదా, కనీసం మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.
ఇటు కేసీఆర్, అటు కేటీఆర్ ఇద్దరూ మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో పార్టీ నేతలను సైతం తొందరపడొద్దని కేసీఆర్ సలహా ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పై ఇప్పటికప్పుడు విమర్శలు చేస్తే ఎలాంటి లాభం ఉండదని… ప్రజల మూడ్ ను బట్టి సర్కార్ పై సమరానికి సన్నద్ధం కావాలని కేసీఆర్ భావిస్తున్నట్టు బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. తొందరపాటు నిర్ణయాలతో పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోతుందని అందుకే ఇంకొంతకాలం ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లతోనే సర్కార్ విధానాల్లోని లోపాలను ప్రజలకు వివరించాలని తనను కలిసిన నేతలకు కేసీఆర్ సూచించినట్టు సమాచారం.
రాష్ట్రంలో కీలకమైన ఎన్నికలు కూడా పూర్తి అయ్యాయని, ఇప్పుడు తొందరపడి దూకుడుగా వ్యవహరిస్తే పార్టీ క్యాడర్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అందుకే స్లో అండ్ స్టడీ తరహాలో ముందుకు సాగుదామని నేతలకు కేసీఆర్ హితబోధ చేస్తున్నట్లు బీఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విద్యుత్ కొనుగోలు , ఒప్పందాలతో పాటు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తప్పవనే సంకేతాల నేపథ్యంలోనే కేసీఆర్ ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. మొత్తానికి కేసీఆర్ వైఖరి చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా లైట్ తీసుకునేట్టు ఉన్నారని టాక్ వినిపిస్తోంది.