భవిష్యత్తులో ఎప్పుడైనా చేయబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు తొలి మెట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శాఖల మార్పులు చేశారు. నిజానికి ఇందులో మార్పులకంటే తండ్రీ కొడుకులకు చేర్పులే ఎక్కువ. అందులోనూ వనరుల రీత్యానూ ప్రచారం రీత్యానూ కీలకమైనవవన్నీ వారి చేతిలో వుంచుకోవడం కనిపిస్తూనే వుంది.
పరిశ్రమల శాఖ, గనుల శాఖ కెటిఆర్‌కు అప్పగించడంలో ఒక రాజకీయ సంకేతం వుంది. పంచాయితీ రాజ్, ఐటి మంత్రిగా వున్న కెటిఆర్‌కు జిహెచ్ఎంసి బాధ్యతలు అప్పగించి తర్వాత బహిరంగ సభలోనే మునిసిపల్ శాఖ ఇస్తున్నట్టు నాటకీయంగా ప్రకటించారు. ఆ తర్వాత పరిశ్రమలు తీసుకొచ్చారు. హరీశ్ రావు బారం అన్నారంటూ గనులనూ అప్పగించారు.
ఇక తెలుగుదేశంకు గండి కొట్టడంలో ముఖ్యపాత్ర వహించిన తలసాని శ్రీనివాస్యాదవ్నుంచి వాణిజ్యపన్నులు తగ్గించి ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారు. అలాగే కెటిఆర్ నుంచి జూపల్లికి పంచాయతీ రాజ్‌ను బదలాయించడం పెద్ద బాధ్యతేనని దీనికి సామాజిక కోణం తప్ప మరే సమర్థన లేదని టిఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఒకరన్నారు. అయితే ఆ ఇచ్చే సమయంలోనూ కెటిఆర్ చూస్తున్న మిషన్ భగీరథను జూపల్లికి కేటాయించకపోవడం గమనార్హం.
బంగారు తెలంగాణకు వనరులు కావాలనే వాదనతోనో లేక లాభదాయకమైన శాఖలు తమ ప్రత్యక్ష అధీనంలోనే వుండాలన్న ఉద్దేశంతోనే కెసిఆర్ ఈ మార్పులు చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పటికీ ఒకో మంత్రి దగ్గర చాలా ఎక్కువ శాఖలే వున్నాయి. బహుశా రేపు తనకు బాగా విశ్వాసపాత్రులైన వారు లభిస్తే ఇవి కూడా వారికి అప్పగించి తమ పర్యవేక్షణ కొనసాగించవచ్చు.
ఈ మార్పుల తర్వాత కెసిఆర్ పట్టు మరింత బిగిసిందని కెటిఆర్‌కు ఇంకా వూతం లభించిందని పార్టీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఇన్నిచేసిన కెసిఆర్ ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ఎండలు కరువు నీటి కొరత వంటివాటిపై తక్షణ చర్యలు బాధ్యతలు అప్పగించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే అనేక విధాల అయోమయంగా వున్న విద్యారంగాన్ని కూడా బలోపేతంచేసే చర్యలు లేవు