లోక్‌సభ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఈ సారి ఎక్కువగా కొత్త ముఖాలను ఎంచుకోబోతున్నారు. ఇప్పటి వరకూ టీడీపీ గెలవని మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాలపై ఆయన ప్రత్యక దృష్టి పెట్టారు. చేవేళ్ల కేసీఆర్‌కు సవాల్‌గా మారింది. గత ఎన్నికల్లో గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. ఆ స్థాయిలో టీఆర్ఎస్ తరపున పోటీ పడేవారు లేరు. స్వామిగౌడ్, మహేందర్ రెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. ఇప్పుడు గడ్డం రంజిత్ రెడ్డి అనే పారిశ్రామిక వేత్త పేరు తెరపైకి వచ్చింది. ఆయన పేరు కేసీఆర్ ఖరారు చేశారని చెబుతున్నారు.
మల్కాజిగిరిలో అంగబలం, ఆర్థికబలం మెండుగా ఉన్న నేతను ఈ స్థానంలో నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్ గిరి పార్లమెంటరి నియోజకవర్గ పార్టీ సన్నాహక సమావేశంలోనూ రాజశేఖర్ రెడ్డి హడావిడి కనిపించింది. పార్టీలో మొదటినుంచి ఉన్న నవీన్ రావు సైతం టిక్కెట్ పై గంపెడాశలు పెట్టుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ సైతం సికింద్రాబాద్, మల్కాజ్ గిరి ఏదైనా ఒక స్థానంలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ సికింద్రాబాద్‌లో గెలిచింది. మేయర్ బొంతు రామ్మెహన్ సతీమణి బొంతు శ్రీదేవి టిక్కెట్ ను ఆశిస్తున్నారు. మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ కి చాన్సివ్వాలని కోరుతున్నారు.
మరికొన్ని చోట్ల కూడా.. కొత్త ముఖాలు తెరపైకి రాబోతున్నాయి. ఈ సారి వెంకటస్వామి కుమారుడికి టిక్కెట్ లేదని తెలుస్తోంది. పెద్దపల్లిలో జి.వివేక్‌ను కాకుండా నేతకాని సామాజిక వర్గానికి నాయకుడొకరిని బరిలో దించుతారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఖమ్మంలోనూ సిటింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాకుండాకమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యాపారవేత్తను బరిలో దించబోతున్నారు. మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్‌ను పక్కన పెట్టి, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మహబూబ్‌నగర్ నుంచి జితేందర్‌రెడ్డికి కూడా కేసీఆర్ మొండి చేయి చూపించబోతున్నారు.