దసరా పండుగ రోజుల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల బందోబస్తు సాయంతో కొన్ని బస్సులను ప్రభుత్వం నడుపుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నా… ప్రజలకు ఇబ్బందులైతే తప్పడం లేదు. అయితే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో మొదట్నుంచీ ఢీ అంటే ఢీ అన్నట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీలే లేవనీ, సంస్థకు నష్టాలు వస్తే బాధ్యత వహించాల్సింది వారే కదా అనీ, సమ్మె వల్ల వారికే నష్టమనీ పాల్గొన్నవారి ఉద్యోగాలు పోతాయని కూడా హెచ్చిరిస్తూ వచ్చారు! కానీ, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయమై ముఖ్యమంత్రి ధోరణి కొంత మారినట్టుగా కనిపిస్తోంది.
సమ్మె నేపథ్యంలో అధికారులతో ఆదివారం నాడు సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికిప్పుడు సమ్మెను ఆపేట్టుగా చేయడం, లేదా వాయిదా వేసేట్టుగా మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. అవసరమైతే వెంటనే కొన్ని డిమాండ్లకు అంగీకరిద్దామని కూడా అన్నారని అధికారులు కొందరు చెబుతున్నారు. వెంటనే చర్చలకు రావాలంటూ కార్మిక సంఘాలకు ప్రభుత్వం నుంచి నేటి సాయంత్రం ఓ సందేశం పంపనున్నట్టు తెలుస్తోంది. సమస్యలపై చర్చించి, కార్మికులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందామని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
తాత్కాలికంగా సమ్మె ఆపేందుకు కొన్ని డిమాండ్లు పరిష్కారం అని అంటూ ప్రభుత్వం నుంచి ప్రయత్నం మొదలైనా… ఆర్టీసీ కార్మికుల అసలైన డిమాండ్లు చిన్నవేం కావు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, కొత్త పీఆర్సీని అమలు చేయడం… ఈ రెండు డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తే, సమ్మెకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. అయితే, ఈ రెండు డిమాండ్లపైనే మొదట్నుంచీ సీఎం కేసీఆర్ గరంగరంగా మాట్లాడుతూ వచ్చారు. విలీనానికి ప్రభుత్వం సానుకూలంగా లేదు. అయితే, ఇప్పుడు సమ్మె హీట్ బాగా పెరుగుతూ ఉండటంతో ఓ అడుగు తగ్గినట్టుగా కనిపిస్తోంది. నిజానికి… ఇదే ధోరణిలో ఓ నాలుగు రోజుల కిందటే స్పందించి ఉంటే బాగుండేది. అప్పుడేమో ఓ త్రిసభ్య కమిటీని వేయడంతో… కమిటీపై కార్మిక సంఘాలు ఏమాత్రం విశ్వాసం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు సీఎం నేరుగా కబురంపే ప్రయత్నం చేస్తే…. సమస్య ఓ కొలీక్కి వచ్చే అవకాశమైతే ఉంటుంది.