తెలంగాణలో సీనియర్ నాయకుడు, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించినా ఆయనను ఎలా అడ్డుకోవాలన దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహ రచనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలను రెచ్చగొట్టే వాక్ పటిమ ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే మరింత రెచ్చిపోతారని ముఖ్యమంత్రితో సహా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అందరూ భావిస్తున్నారు. దీనిని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచే రేవంత్ రెడ్డికి ఎలాంటి సహకారం అందకుండా చేయాలన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి అనుకూలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించ రాదంటూ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో వీరిని లోపాయికారిగా తమవైపు తిప్పుకోవడం, తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు ఆకర్షించుకునే రేవంత్ రెడ్డికి సహాయ నిరాకరణ చేయించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తాను జైలులో ఉండగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను కలిసేందుకు రాలేదంటూ రేవంత్ రెడ్డి బహిరంగంగానే తన ఆవేదన వెలిబుచ్చారు. దీనిని కూడా తనకు అనుకూలంగా వాడుకోవాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఆ వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు తొలి అడుగులు వేశారని, భవిష్యత్తులో నామినేటెడ్ పదవులలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి మరింత ప్రాధాన్యం కల్పిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కూడా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు పనికి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా సమాచారం. ముల్లును ముల్లుతోనే తీయాలనట్లుగా రేవంత్ రెడ్డిని రెడ్డి సామాజికవర్గం తోటే కొట్టాలనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.