ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున చేయాల్సిన పనులన్నింటినీ తీరిగ్గా చేసుకుని ఎన్నికలకు వెళదామని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , రాజ్యసభ సభ్యులకు స్పష్టం చేశారు . తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ ఎల్పీ సంయుక్త సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎన్నికల్లో గెలవబోతున్నామని సర్వే ఫలితాలు ప్రకటించారు. బీజేపీకి, టీఆర్ఎస్కు పదమూడు శాతం గ్యాప్ ఉందన్నారు.
వరంగల్ విజయగర్జన సభకు ఇంచార్జీగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రకటించారు. ప్రతి గ్రామం నుంచి బస్సు రావాలని.. 22వేల బస్సులు సభకు రావాలని దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహించి మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. హైటెక్స్‌లో నిర్వహించనున్న ప్లీనరీకి మొత్తం పధ్నాలుగువేల మందిని పిలవాలని మొదట అనుకున్నారు. అయితే ఆరు వేల మందికి కుదించాలని నిర్ణయించారు. నియోజకవర్గం నుంచి యాభై మంది రావాలని కేసీఆర్ సూచించారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కేసీఆర్ సూచనలు ఇస్తారని.. ఎంత వేగంగా పనులు చేయాలో సూచిస్తారని అందరూ అనుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం నింపాదిగా అన్ని పనులు చేసుకునే ఎన్నికలకు వెళదామని గతం కంటే ఎక్కువ స్థానాలు గెల్చుకుదామని సూచించారు. అయితే కేసీఆర్ చివరి వరకూ నిర్ణయాన్ని బయట పెట్టరని కానీ .. ముందస్తు దిశగా ఆయన ఆలోచనల్ని కొట్టి పారేయలేమని కొంత మంది టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.