కుమారుడు కెటిఆర్‌ను తన వారసుడుగా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుందన్న కథనాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందన చూస్తే అంగీకారముద్ర వేసినట్టే కనిపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. “చేస్తే అవుతారా? ప్రోటోకోల్ పాటించకపోతే ఇతర మంత్రులు వూరుకుంటారా?” వంటి మాటలన్నీ సన్నాయి నొక్కులుగా వున్నాయి తప్ప స్పష్టమైన రాజకీయ స్వరం లేదు. ఆ చర్చ అప్రస్తుతం అనో ఆ ఆలోచన ఇప్పుడు లేదనో చెప్పడానికి సిద్దం కాలేదు. పోనీ “అవన్నీ మీ వూహాగానాలే వదంతులే…”అని ఖండించింది కూడా లేదు. ఓటుకు నోటు కేసు గురించి అడిగితే తర్వాత మాట్లాడతానని దాటేయడం కూడా దాన్ని ప్రస్తావించిన హరీష్‌కు కొంత ఇబ్బంది కలిగించే అంశం. అదే వంద స్థానాల సవాలుకు వచ్చేసరికి “కెటిఆర్ ఏడన్నాడు?” అని వెనకేసుకొచ్చారు. ఆ లెక్కతో ఏకీభవించడానికి కూడా సిద్ధం కాలేదు. మజ్లిస్ మతతత్వంపై ప్రశ్నలకు కూడా “ఎవరో అన్నది నేనెలా చెబుతానని..” దాటేశారు గాని వారు తమ పార్టీ ప్రముఖులే గాక కుటుంబ సభ్యులు కూడా గనక ఉభయత్రా తనకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వుందని భావించలేదు. చాలా రాజకీయ పాలనా పరమైన ప్రశ్నలకు నిర్దిష్టంగా ఖరాఖండిగా సమాధానాలు ఇచ్చిన కెసిఆర్ కుమారుడికి వారసత్వం గురించి మాత్రం లోతులు తడమకుండా వదలేసి పరోక్షంగా ఆశీర్వాదాలు అందించారన్న మాట. “అతనికే అధిక ప్రాధాన్యత నిస్తే ఇతర మంత్రులు వూరుకుంటారా? అన్న ఆయన ప్రశ్నకు ఇప్పటి వరకూ వున్నారు కదా..అని ఆచరణలో చూస్తున్న దృశ్యమే సమాధానం చెబుతుంది. ఒక దశలో కెటిఆర్ స్వయంగా దీనిపై క్షమాపణలు చెబుతున్నానని ఒక చర్చలో కెటిఆర్ అన్నారు కూడా. కెసిఆర్ నిరాహారదీక్ష వంటివి ఇంకా మొదలు కాని రోజుల్లోనే రవి ప్రకాశ్ జరిపిన మారథాన్ షోలోనే కుటుంబ నాయకత్వం గురించి అడిగితే “పని చేసేవారికి స్థానం కల్పించడం ఎలా పొరబాటవుతుందని…” ఎదురు ప్రశ్న వేశారు. సో..ఆయన అప్పుడూ ఇప్పుడూ క్లియరే! కాకపోతే అప్పుడు హరీశ్ రావుతో సహా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రశ్న వచ్చింది ఇప్పుడు ఒక్క కెటిఆర్ చుట్టూనే తిరుగుతుంది.