తెలంగాణలో వరదలకు క్లౌడ్ బరస్ట్ కుట్ర ఉండొచ్చంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ ప్రారంభమైంది. వరదలు.. వరద బాధిత సమస్యలు.. కాళేశ్వరం ముంపు వంటి అంశాలు వెనక్కి పోయాయి. అసలు కుట్రపూరితంగా ఇలా వర్షాలు.. వరదలు కురిపించవచ్చా అని ప్రతి ఒక్కరూ చర్చించకోవడం ప్రారంభించారు. విపక్ష నేతలు కేసీఆర్ ప్లాన్ ప్రకారమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. అయితే రకరకాల కామెంట్లతో వారూ చర్చలోకి వస్తున్నారు.
పది కిలోమీటర్ల లోపు ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇది ప్రకృతి సహజంగా జరుగుతుంది. అయితే కేసీఆర్ విదేశీ కుట్ర అంటున్నారు. ఇటీవల చైనా ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రకృతి వైపరీత్యాలను కృత్రిమంగా సృష్టించగలిగే.. టెక్నాలజీ చైనా దగ్గర ఉందని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో చైనా తన శత్రు దేశాల్లో కృత్రిమంగా ప్రకృతి విపత్తులు సృష్టిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ చెప్పినటలుగా జమ్ముకశ్మీర్, లెహ్‌తో పాటు ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ లలో చోటు చేసుకుంటున్న క్లౌడ్ బరస్ట్‌లు చైనా పనేనని చెబుతున్నారు. ఇప్పుడు గోదావరిలోనూ క్లౌడ్ బరస్ట్ కుట్ర జరుగుతోందన్న కేసీఆర్ వ్యాఖ్యలతో ఈ అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి. చైనా ఇలాంటి కుట్రలు చేసినా అది సరిహద్దులకే పరిమితం కానీ ఇంత లోపలకు వచ్చి చేయలేదని చెబుతున్నారు. అత్యధికులు ఈ విషయాలను నమ్మరు కానీ.. కేసీఆర్ అన్న మాటలపై మాత్రం విస్తృతమైన చర్చ జరుగుతోంది. నిజానిజాలేంటో ఎప్పటికీ తెలియకపోవచ్చు.