బీఆర్ఎస్ పార్టీ అంటే వైసీపీ నేతలు భయభక్తులు ప్రదర్శిస్తారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు జగన్ రెడ్డి పరువు తీస్తూనే ఉంటారు. ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కూడా అదే చేశారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన జగన్ రెడ్డి పాలనా ఎంత గొప్పగా ఉందో.. అక్కడి పరిస్థితుల్ని తెలంగాణతో పోల్చి కామెడీ చేసి జగన్ రెడ్డి ఇజ్జత్ తీశారు. డబుల్ రోడ్లు ఉంటే తెలంగాణ .. సింగిల్ రోడ్ ఉంటే ఏపీ అని కేసీఆర్ తేల్చేశారు. ఏపీలో రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు సరిగ్గా నిర్మించలేదని కేసీఆర్ చెప్పేశారు. సమయంలో ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి.
అలాగే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే పాలన రాదని.. హేళన చేశారని కానీ ఇప్పుడు ఏపీ నుంచి రైతులు తెలంగాణ కు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. తెలంగాణలో ధాన్యం అమ్ముకునేందుకు ఏపీ రైతులు వస్తన్నారని అక్కడి ప్రభుత్వం సరిగ్గా ధాన్యం సేకరణ చేయడం లేదని కేసీఆర్ చెప్పినట్లయింది. అదే సమయంలో విద్యుత్ అంశంపైనా స్పందించారు. తెలంగాణలో కరెంట్ పోదన్నారు. రాష్ట్రం విడిపోతే.. తెలంగాణ చీకటి అవుతుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కర్ర పట్టుకుని చూపించారన్నారు. కానీ ఇప్పుడు ఏపీలో చిమ్మ చీకట్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీలో కరెంట్ కోతలపై తెలంగాణ నేతలు వెసే సెటైర్లకు కొరతేమీ ఉండదు. మోటార్లకు మీటర్లు పెడితే పెద్ద ఎత్తున నిధులు ఇస్తామన్నారని..కానీ అలా పెట్టేది లేదని చెప్పామన్నారు. పాతిక వేల కోట్లు నష్టం వచ్చినా సరే మీటర్లు .. రైతుల మోటార్లకు పెట్టేది లేదన్నారు.
ఏపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టేందుకు అంగీకరించి అప్పులు , అదనపు సాయం తెచ్చుకుంది. హరీష్ రావు ఎన్నో సార్లు రైతుల మెడకు జగన్ ఉరేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ రాకపోతే అమరావతి లాగే హైదరాబాద్ అవుతుందని హెచ్చరించారు. ఈ మాటలు వైరల్ అయ్యాయి. కేటీఆర్ ఓ సారి.. ఏపీని నరకంతో పోల్చారు. అప్పట్లో వివాదాస్పదమయింది.
నిజానికి బీఆర్ఎస్ తో ఏపీ అధికార పార్ట పెద్దలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా రెండు పార్టీలు సహకరించుకుంటూ ఉంటాయి. బీఆర్ఎస్ పై .. వైసీపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయరు కానీ.. బీఆర్ఎస్ నేతలు మాత్రం.. తరచూ తమ పాలన ఎంత గొప్పగా ఉందో చెప్పుకోవడానికి ఏపీ పరిస్థితుల్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. అయినా వైసీపీ నేతలకు పెద్దగా ఫరక్ పడదు. తుడిపేసుకుని వెళ్లిపోతారు.