సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి పరులంటూ కేసీఆర్ హెచ్చరికలు చేశారంటూ వచ్చిన వార్తలతో తెలంగాణలో రాజకీయదుమారం రేగుతోంది. అన్ని చిట్టాలు ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోర్టు సుమోటోగా చర్యలు తీసుకోవాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత సమావేశంలోనివి. వాటికి రికార్డులేమీ ఉండవు. అందుకే చేశారా లేదా అన్నది తెలియదు కానీ మీడియాలో విస్తృత ప్రచారం వచ్చేలా మాత్రం చేసుకున్నారు. దీనికి కేసీఆర్ ప్రత్యేక ప్లాన్ ఉందన్న గుసగుసలు బీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి.
టిక్కెట్లు ఎగ్గొట్టాలనుకున్న ఎమ్మెల్యేలపై అవినీతి ముద్ర వేసే ప్లాన్ కేసీఆర్ అమలు చేస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలపై అవినీతి ముద్ర వేసి వారికి టిక్కెట్లు నిరాకరించడంతో పాటు ఇతర పార్టీల్లో చేరకుండా వారి ఇమేజ్ ను బద్నాం చేసే ప్రయత్నమేనన్న అనుమానాలు బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నాయి. కేసీఆర్ మాత్రం తన పాలన గొప్పగా ఉందని ఎమ్మెల్యేల వల్లే వ్యతిరేకత వచ్చిందని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారని భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేల్ని బలి చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని అందులో భాగంగానే వారిపై నేరుగా అవినీతి ముద్ర వేస్తున్నారని అంటున్నారు.
సగం మందికిపైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వారికి టిక్కెట్లు ఇస్తే గెలవరని గతంలోనే ప్రచారం చేశారు. కానీ వారంతా బీజేపీలో చేరిపోతారన్న భయంతో మళ్లీ .. అందరికీ టిక్కెట్లు అంటూ కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి మళ్లీ మాట మార్చేశారని.. ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడం వెనుక అసలు స్కెచ్ వేరే ఉందని చెబుతున్నారు. . వదిలించుకుదామనుకుంటున్న ఎమ్మెల్యేలందరూ ఇక అవినీతి ముద్రకు రెడీ కావాలన్న ఓ అంచనాకు వస్తున్నారు. అయితే వారు ఇలా ముద్ర వేయించుకోవడానికి రెడీ అవుతారా లేకపోతే తిరుగుబాటు చేస్తారా అన్నది కీలకం