ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దూసుకుపోతున్నారు. కేసీఆర్ కి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమే కదా, కానీ ఆయన ఫోకస్ అంతా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, టీడీపీ మీద మాత్రమే ఉంటోంది. ప్రతీరోజూ చంద్రబాబు విమర్శల దాడి పెంచుతున్నారు. ఒకే అంశాన్ని పదేపదే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ్ల కూడా ఆయన పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల్లో మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను ప్రజలకు వేశారు. తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరమా కాదా అనే ప్రశ్నకు ప్రజల నుంచి జవాబు పదేపదే అడిగి మరీ రప్పించారు. అంతేకాదు, ప్రజల స్పందన చూడండి, జనాలకు చూపించండీ అంటూ మీడియా కెమెరాలను కూడా ప్రజలవైపు తిప్పాలని కూడా కేసీఆర్ నర్సంపేట సభలో కోరారు.
చాలా తెలివైనోళ్లం అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్ల 24 గంటల కరెంటు లేదన్నారు కేసీఆర్. ఎవర్నైతే తెలివి తక్కువ వారని అన్నారో, మన దగ్గరే 24 గంటల కరెంటు ఉందన్నారు. మహా మేధావులం అని చెప్పుకునే ఆంధ్రా ముఖ్యమంత్రుల కంటే, తెలంగాణ చాలా బాగుందనేది భారత ప్రభుత్వమే చెప్పిందన్నారు. అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ పూర్తిగా జరగలేదనీ, కానీ తెలంగాణలో పూర్తి చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ఆంధ్రాలో పాలన సరిగా లేదనీ, చంద్రబాబుకి ఈసారి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. సూర్యాపేట సభలో కేసీఆర్ మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు కావాలా, చంద్రబాబు కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ టిక్కెట్లను కూడా చంద్రబాబు నాయుడే నిర్ణయించారని ఆరోపించారు.
తెలంగాణలో ఎన్నికల జరిగితే… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేపడుతున్న కార్యక్రమాలు, లేదా అమలు చేస్తున్న పథకాల గురించి మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్ కి ఏముంది..? ఆంధ్రాలో కరెంట్ ఉందా లేదా, అక్కడ రుణమాఫీ సక్రమంగా జరిగిందా లేదనే పోలిక తేవాల్సిన అవసరం ఏముంది..? ఇవి తెలంగాణలో ఎన్నిక ప్రచారాంశాలు ఎందుకవుతాయి..? గడచిన నాలుగేళ్లలో తెరాస సర్కారు సాధించిన విజయాలను వివరిస్తే.. వాటిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. పక్కరాష్ట్రంతో పోల్చి చూస్తే తప్ప, తమ సర్కారు చేసింది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేని పరిస్థితి ఉందా అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణ టీడీపీనిగానీ, చంద్రబాబు నాయుడునిగానీ… తెరాసకి లేదా కేసీఆర్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఇక్కడి ప్రజలు చూడరు కదా! కానీ, ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే అని చెప్తూ, ఆంధ్రాలో ఆయనకి డిపాజిట్లు రావని విమర్శించడం వల్ల తెరాసకు ఏరకమైన మేలు జరుగుతుంది? పైగా, ఆంధ్రోళ్లు ఆంధ్రోళ్లు అని విమర్శించడం ద్వారా.. ఇక్కడి సెటిలర్ల మనోభావాలను మరోసారి దెబ్బతీసే పరిస్థితి వస్తుంది.