భాష ప్రాతిపదికపై ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ విభజనను చివరి వరకూ విధానపరంగా వ్యతిరేకించిన పార్టీ దేశంలో సిపిఎం పరిస్థితి తెలంగాణ తర్వాత ఎలా వుంటుందని చాలామంది సందేహించారు. అయితే తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం, ప్రజలలో పునాది ఉద్యమాల సంప్రదాయం కారణంగా ఆ పార్టీ మామూలుగానే పనిచేసుకుపోతున్నది. టిఆర్ఎస్ నేతలు కొంతమంది ఎప్పుడైనా ఏదైనా అన్నా ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఆ పాత సమస్యలను తిరగదోడే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. పైగా ఆయనే స్వయంగా సిపిఎం మద్దతు కోరిన సందర్భాలున్నాయి. అలాటిది హఠాత్తుగా ఇప్పుడు సిపిఎంకు తెలంగాణ పేరెత్తే అర్హత లేదని ఆదివారం వరంగల్లో ధ్వజమెత్తారు.. అక్టోబరు 17 నుంచి నాలుగు నెలల పాటు వేల కిలోమీటర్ల పర్యంతం పాదయాత్ర ప్రకటించడమే ఇందుకు కారణమైంది.సీట్లు వున్నా లేకున్నా అధికార రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఉద్యమాలతో ప్రజలను కదిలించే సిపిఎం వామపక్షాలను విభేదించేవారూ గౌరవిస్తారు. కెసిఆర్ కూడా అలా మాట్లాడ్దం నాకు తెలుసు. . భాషా రాష్ట్రాల విభజనను విధాన పరంగా సిపిఎం వ్యతిరేకించిన మాట నిజమే ప్రత్యేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడంది లేదు. యుపిఎ మనుగడకు టిఆర్ఎస్ కన్నా సిపిఎం మద్దతే కీలకం గనక కనీస కార్యక్రమంలోనూ రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ విదర్భ అంశాల ప్రస్తావన ఆ పార్టీ మొండిగా అడ్డుపడితే సాధ్యమై వుండేది కాదు. తన విధానం తాను చెప్పడం తప్ప ఇతర పార్టీల ఉద్యమాలకూ రాజకీయ ప్రక్రియకు సిపిఎం వ్యతిరేకత చూపలేదు. త్వరగా పరిష్కరించాలనే కోరుతూ వచ్చింది. అలాగాక కాంగ్రెస్,టిడిపిలు రెండు ప్రాంతాల్లో రెండు పాటలు పాడుతూ అవకాశవాదం ప్రదర్శించాయి . ద్వంద్వనాటకం నడిపిన పార్టీలను వదలిపెట్టి ఒక మాటపై ప్రజలతో నిలబడిన వారిని క్షమాపణలు అడగడమేమిటని ఇప్పుడు కమ్యూనిస్టు అభిమానులు అడుగుతున్న ప్రశ్న. గతాన్ని తవ్వితీసుకునేట్టయితే తెలుగుదేశంలో అంత సుదీర్ఘ కాలం కొనసాగినందుకు, ఇప్పటికీ వారిని పుంఖానుపుంఖంగా చేర్చుకుంటున్నందుకు టిఆర్ఎస్ కూడా సంజాయిషీ చెప్పాల్సి వుంటుంది కదా?
విభజన ఉద్యమం తీవ్రంగా వున్నప్పుడు తెలంగాణలో కొన్ని పార్టీల నేతల పర్యటనలను అడ్డుకుంటామని టిఆర్ఎస్ ప్రకటిస్తే. ఎవరి రాజకీయాలు వారు చెప్పుకుంటారు తప్ప అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని అంటుండే వారు. ఆ ఘట్టాలన్ని ముగిసి తెలంగాణ ఏర్పడింది. ఇప్పుడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర తలపెడితే దానిపై స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందే విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఉనికి కోసం చేస్తున్నారని, రష్యా చైనా పోయినా ఇక్కడ వేళ్లాడుతున్నరన్నట్టు మాట్లాడారంటే రాజకీయ వ్యతిరేకతే కనిపించింది . యాత్రకు ముందు వారు క్షమాపణ చెప్పాలని ముక్కు నేలకు రాయాలని షరతులు పెట్టడం ,వూరూరా నిలదీయాలని ముఖ్యమంత్రి గారే పిలుపునివ్వడం కూడా ప్రజాస్వామ్య స్పూర్తి కాదు.. ఇలాటి వాటివల్ల వాతావరణం కలుషితమయ్యే అవకాశముంది. కెసిఆర్ వ్యాఖ్యలను అన్ని పార్టీలూ ఖండించాయి. ఈ వివాదం సద్దుమణిగి యాత్ర శాంతియుతంగా సాగిపోతుందని ఆశించాలి.