ఏపీలో ఇరవై ఐదు జిల్లాలు రావొచ్చని.. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. తనతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి ఇలా చెబుతున్నానని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… తెలంగాణకు 33 జిల్లాలు అవసరం లేదని 20 ఉంటే చాలని చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఇలా..ఏపీ ప్రస్తావన తీసుకు వచ్చారు. అంతే.. ఏపీకి సీఎం జగన్మోహన్ రెడ్డినా.. కేసీఆరా అంటూ.. కొంత మంది సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించారు. ఏపీలో ఇరవై ఐదు జిల్లాలు వస్తాయని.. ప్రత్యేకంగా అసెంబ్లీలో కేసీఆర్ చెప్పడం కాదు.. ఎన్నికల ముందు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చేస్తానని ప్రకటించడమే కాదు… ఆయా జిల్లాలకు తగ్గట్లుగా పార్టీ అధ్యక్షుల్ని కూడా నియమించారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జిల్లాల ఏర్పాటులో పెద్దగా ముందడుగు పడలేదు. రాజధాని మార్పు… స్థానిక ఎన్నికలు..జనగణన ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతున్నాయి. దాంతో.. ఈ ఏడాది కాదు.. వచ్చే ఏడాదిలోనే జిల్లాల విభజన చేయాలనుకుంటున్నారు. తెలంగాణ సీఎం కొత్తగా చెప్పడం కాదు కానీ.. ఏపీలో ఇరవై ఐదు జిల్లాలపై మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. కానీ కేసీఆర్ చెప్పడం.. జగన్ తప్పన్నట్లుగా.. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించడం ప్రారంభించారు.
జగన్మోహన్ రెడ్డి అన్నీ కేసీఆర్ అనుమతితోనే చేస్తున్నారని.. మూడు రాజధానులు కూడా ఆయన ఆలోచనేనని టీడీపీ వర్గాలు ఆరోపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో.. కేసీఆర్.. ఆంధ్రా గురించి అసెంబ్లీలో మాట్లాడకపోతే బాగుండునని.. వైసీపీ నేతలు కూడా అనుకుంటున్నారు. కానీ ఆ మాట టీఆర్ఎస్ అధినేత వరకూ తీసుకెళ్లే పరిస్థితి లేదు.