తెలంగాణ ఆర్టీసీ సమస్య జఠిలమయింది. హమీల అమలు కోసం కార్మికులు సమ్మెబాట పట్టగా.. అందర్నీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రభుత్వం సంకేతం పంపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం ఎవరూ తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఆర్టీసీని తెగేదాకా లాగుతున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఆర్టీసీ నష్టాల్లో ఉంటే.. ఉద్యోగులు సమ్మె చేసి… బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. అందుకే… సమ్మె చేస్తున్న ఉద్యోగులతో ఇక సంస్థకు సంబంధం లేదని ప్రకటించారు. కొత్త నియామకాలకు రంగం సిద్ధం చేశారు. సునీల్ శర్మ కమిటీ ఈ మేరకు సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చింది.
ఆర్టీసీలో 30 శాతం అద్దె బస్సులకు సునీల్ శర్మ కమిటీ సిఫార్సు చేసింది. సగం ప్రైవేటీకరణకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్ కారేజ్ బస్సులు ఇతర రూట్లతో పాటు నగరంలో కూడా నడపేలా నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే వుండేలా నిబంధనలు పెట్టనున్నారు. ప్రైవేటు బస్సులు చార్జీలు కూడా ఆర్టీసీ పెంచినప్పుడే పెంచాలి. ఇప్పటికీ 21% అద్దెబస్సులను ఆర్టీసీ నడుపున్నది. అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9% మాత్రమే. అదనంగా 9% అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లేనని ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో తేల్చారు.
ప్రభుత్వం దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1200 మాత్రమే. మిగతావారిని డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనే లేదని సీఎం చెబుతున్నారు. ఎవరు ఎవర్నీ డిస్మిస్ చేయలేదని.. వాళ్ళంతట వాళ్ళే తొలగిపోయారని సీఎం చెబుతున్నారు. గడువులోపల విధుల్లో చేరకపోవడంతో వాళ్ళది సెల్ఫ్ డిస్మిస్ అయినట్లేనని కేసీఆర్ అంటున్నారు. ప్రభుత్వ, ఆర్టీసీ యాజమాన్య విజ్ఞప్తికి వారు స్పందించలేదని గుర్తు చేశారు. విధుల్లోకి రానివారు ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తే లేదు. యూనియన్లు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయని కేసీఆర్ తేల్చేశారు.