తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప, అంతవరకూ గడ్డం తీయనంటూ కొన్నాళ్ల నుంచీ టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీక్షపట్టి కూర్చున్న సంగతి తెలిసిందే. ఇక, ఆ గడ్డంపై అధికార పార్టీ నేతలు అడపాదడపా పంచ్ వేయడం, ఎద్దేవా చేయడం కూడా చూస్తున్నారు. ఇవాళ్ల మంత్రి కేటీఆర్ ఉత్తమ్ గడ్డంపై మరోసారి పంచ్ వేశారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు చేశారు.
ఏళ్ల తరబడి గడ్డాలు తీయం, మీసాలు తీయం అంటూ స్టంట్లు ఎవరైనా కొట్టొచ్చు. కానీ ఏం ఫరక్ పడతది అన్నారు కేటీఆర్. పక్కనే ఉన్న మంత్రి నాయని నర్సింహా రెడ్డితో… ‘ఏం నర్సన్నా.. నాకు తెల్వక అడుగుతున్నా. గడ్డం పెంచుకున్న పెతీవోడు గబ్బర్ సింగ్ అయిపోతాడే’ అన్నారు. నువ్వు గడ్డం తీస్తేందీ, తీయకపోతేందీ. ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఉత్తమ్ కుమార్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. డైలాగులు చెప్పడం తమకీ వచ్చనీ, కానీ పని చేయడం ముఖ్యమన్నారు. తెరాస రాక ముందు దాదాపు 67 ఏళ్లు దేశాన్ని పాలించింది పాలించిందెవరనీ, దాన్లో అత్యధిక కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే అనీ.. కానీ సాధించిందేముందన్నారు. వాళ్లే సరిగా పనిచేసి ఉంటే.. కేసీఆర్ ఎక్కడికెళ్లి వస్తుండె, మేము వచ్చేవాళ్లం కాదు, తెలంగాణ ఉద్యమమే వచ్చి ఉండేది కాదన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు చేతగాలేదుగానీ, తెరాస వచ్చి మూడునాలుగేళ్లకే ఓర్చుకోలేకపోతున్నారన్నారు. ఎవ్వరు ఎన్ని అంటున్నా కూడా కేసీఆర్ సర్కారు ప్రజలకు చేయాల్సిన మేలు చేస్తూనే ఉంటుందన్నారు. కొంత ఓపికతో ఉంటే ప్రతీ సమస్యకూ పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణ కూడా ఒక్కరోజులో వచ్చింది కాదన్నారు. పద్నాలుగేళ్లు పట్టిందన్నారు. కాస్త సంయమనం పాటిస్తే అందరి సమస్యలూ తీర్చే సర్కారు ఇది అన్నారు. ఓ పక్క ఉత్తమ్ గడ్డం మీద పంచ్ లు వేసి, మరోపక్క కాస్త ఆలస్యంగానే అందరి వంతూ వస్తుందనీ, అందరికీ అన్నీ చేస్తామనే హామీ కూడా ఇవ్వడం గమనార్హం. దీంతోపాటు గడచిన ఆరు దశాబ్దాలుగా జాతీయ పార్టీలు చేసిందేం లేదనే ఫెడరల్ ఫ్రెంట్ అభిప్రాయాన్ని కూడా కేటీఆర్ మాటల్లో ఈ మధ్య తరచూ వినిపిస్తూ ఉండటం గమనించదగ్గ విషయం.