తెరాస అధికారంలోకి వస్తే తెలంగాణా రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తాననే కెసిఆర్ హామీని అమలుచేయడం అసాధ్యమని, ఒకవేళ ఆయన దానిని అమలుచేసి చూపిస్తే తనే స్వయంగా తెరాస ప్రభుత్వం తరపున ప్రచారం చేస్తానని జానారెడ్డి కెసిఆర్ కి సవాలు విసిరారు. కాంగ్రెస్ హయంలో ముస్లింలకి 4శాతం రిజర్వేషన్లు కల్పించడానికే చాలా ఆపసోపాలు పడ్డామని, కెసిఆర్ ఏకంగా 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఏవిధంగా హామీ ఇచ్చారో ఆయనకే తెలియాలని జానారెడ్డి విమర్శించారు.
రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున ముస్లింలకు నిజాం కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి హాజరైన ముఖ్యమంత్రి కెసిఆర్, జానారెడ్డి విసిరిన ఆ సవాలుని స్వీకరిస్తున్నట్లుగా చెప్పుకోలేదు కానీ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తాననే హామీకి తన ప్రభుత్వం నేటికీ కట్టుబడే ఉందని ప్రకటించారు. దాని కోసం అధ్యయన కమిటీని ఏర్పాటు చేశామని, దాని నివేదిక రాగానే దాని ఆధారంగా శాసనసభలో తీర్మానం చేస్తామని చెప్పరు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో ముస్లింల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు, వాటి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం ప్రజలకి వివరించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ విషయంలో పునరాలోచన లేదని కెసిఆర్ చెప్పారు.
తద్వారా ఆయన జానారెడ్డి సవాలుని స్వీకరిస్తున్నట్లుగానే భావించవచ్చు. అయితే, ఆ హామీని అమలుచేయడానికి చాలా అవరోధాలున్నాయి. వాటిని అధిగమించడం అసాధ్యమనే చెప్పవచ్చు. ఆంధ్రాలో కాపులకి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి దానిని నెరవేర్చలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యని వాయిదా వేయడానికే రెండు రాష్ట్రాలలో అధ్యయనం పేరిట కమిటీలు వేశారని సంబంధిత వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆ హామీలు అమలుచేయలేకనే ఆ వర్గాల ప్రజలను, నేతలని శాంతపరిచేందుకు రెండు ప్రభుత్వాలు ఏవో తాయిలాలు ప్రకటిస్తున్నాయనే అభిప్రాయం నెలకొంది. కనుక ఇరువురు ముఖ్యమంత్రులు తమ ఈ రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోకపోవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆ హామీలకి కట్టుబడి ఉన్నామని ఇరువురు ముఖ్యమంత్రులు గట్టిగా నొక్కి చెపుతుండటం విశేషమే. ఇప్పటికే రెండేళ్ళు పూర్తయ్యాయి. ఇంకా మూడేళ్ళ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ కమిటీలు తమ అధ్యయనం పూర్తి చేసి నివేదికలు ఇస్తే దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి కేంద్రప్రభుత్వం ఆమోదానికి పంపవలసి ఉంటుంది. వాటిపై పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆ ప్రతిపాదనలకి అంగీకరిస్తే దేశంలో వివిధ కులాలు, మతాలకు చెందినవారు కూడా తమకీ రిజర్వేషన్లు కల్పించమని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేయవచ్చు కనుక కేంద్రప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రతిపాదనలని తిరస్కరించకపోయినా ఆమోదించడం కూడా కష్టమే కనుక వాటిని అటకకెక్కించడం ఖాయం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పించుకొనే ప్రయత్నం చేయవచ్చు. కనుక ఆ వర్గాలకి చెందిన నేతలు ప్రభుత్వాలని నిందిస్తూ ప్రజలని ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయవచ్చు. ఈ చదరంగంలో రాజకీయ పార్టీలు, కులమత సంఘాల నేతలు ప్రయోజనం పొందుతుండగా, ఆ వర్గాలకి చెందిన ప్రజలు మాత్రం మోసపోతూనే ఉండవచ్చు.