తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులపాటు బిజీబిజీగా ప్రాజెక్టుల సందర్శన చేయబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఈ ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం పెట్టుకున్నారు. కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేస్తారు. జిల్లాలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీ పనులను సందర్శిస్తారు. ఆ తరువాత, కన్నేపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజ్, సిరిపురం పంప్ హౌస్, గోలివాడ పంప్ హౌస్ పనులు పరిశీలిస్తారు. శుక్రవారం నాడు మేడారం దగ్గర కాళేశ్వర ఎత్తిపోతుల పథకంలో భాగమైన ఆరో ప్యాకేజీ నిర్మాణ పనులు చూస్తారు. తరువాత, మిడ్ మానేరు ప్రాజెక్టుకు కూడా వెళ్తున్నారు. మొత్తానికి, ఈ రెండురోజులూ అభివృద్ధి పనుల పరిశీలనపైనే ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇంత హడావుడీ, ఇంత ప్రత్యేక శ్రద్ధా ఎందుకు వచ్చిదంటే… ఎన్నికలకు దగ్గర పడుతున్నాయి కదా, అందుకే!
ప్రతీ నియోజక వర్గంలోనూ లక్ష ఎకరాల పంట భూములను నీళ్లు ఇస్తాననీ, రాష్ట్రంలో కోటి ఎకరాల సాగు భూములకు నీరు ఇచ్చిన తరువాతే ప్రజల ముందు ఓట్ల అడగటానికి వస్తానని సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారు. కానీ, ఆచరణలో అంత పెద్ద లక్ష్యాన్ని చేరుకునే దిశగా పనులు ముందుకు సాగడం లేదు. ఉన్న డిజైన్లను కూడా మార్చడం మొదలుపెట్టారు. ఈ రీడిజైనింగ్ లపై ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేశాయి. అవసరం లేకపోయినా స్వలాభం కోసం డిజైన్లు మార్చుతున్నారంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన సందర్భాలూ ఉన్నాయి. సో.. ఎలా చూసుకున్నా ఈ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రజల ఫోకస్ బాగానే ఉంది. మరో ఏడాదిలోగా కీలకమైన ప్రాజెక్టులైనా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఆ పరిస్థితిని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఇంకోపక్క, రకరకాల సంక్షేమ పథకాలు చేపడుతున్నా… బంగారు తెలంగాణలో భాగంగా ఇచ్చిన కోటి ఎకరాలకు నీరు అనే హామీపై కేసీఆర్ ఇప్పట్నుంచే కాస్త జాగ్రత్తపడుతున్నట్టుగా చెప్పొచ్చు. ఇక, కాళేశ్వరంపై ప్రత్యేక శ్రద్ధ ఎందుకంటే.. ఏపీకి పోలవరం మాదిరిగా తెలంగాణకు ఈ ప్రాజెక్టు. వారానిక ఓసారి పోలవరంపై చంద్రబాబు సమీక్షలు చేస్తుంటే… ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి కేసీఆర్ వెళ్తున్నారు.
చిత్రమైన పరిస్థితి ఏంటంటే.. ఎన్నికలు దగ్గరపడితే తప్ప, ఇచ్చిన హామీలపైగానీ చేపడుతున్న ప్రాజెక్టులపైగానీ ఇంత చురుకుదనం రాకపోవడం! ఎన్నికలు వస్తే, చెప్పుకోవడానికీ ఏమీ ఉండదనో, ప్రతిపక్షాలకు విమర్శించే ఆస్కారం ఇవ్వొద్దనే కోణం నుంచే అభివృద్ధి పనులను అధికార పార్టీలు చేపడుతున్న వైనాన్ని చూస్తున్నాం. ఏదో ఒకరకంగానైనా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని సంతోషించాలా? లేదంటే.. ఎన్నికలే పరమావధిగా అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రజల అవసరాలకు తగ్గుతున్న ప్రాధాన్యత క్రమాన్ని చూసి విస్మయం చెందాలా..?