కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించారు కానీ ప్రతీ సారి మహారాష్ట్రకే వెళ్తున్నారు. ఏపీ, ఒడిషాలకు రాష్ట్ర అధ్యక్షుల్నిప్రకటించారు.. మహారాష్ట్రకు ఎవర్నీ ప్రకటించలేదు కానీ… అక్కడ ఏకంగా మూడో బహిరంగసభ పడుతున్నారు. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూంటే…. అటు వైపు చూడటం లేదు. కానీ ఈ నెల 24న ఔరంగాబాద్‌లో మూడో బహిరంగసభ ఏర్పాటు చేశారు. దీనికి కూడా కేసీఆర్ హజరవుతున్నారు. ఇటీవల కేసీఆర్ ఏ కార్యక్రమంలో మాట్లాడినా మహారాష్ట్రలో తమ బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఆ అభిప్రాయం బలపర్చడానికి సభలు నిర్వహిస్తున్నారు.
అయితే ఔరంగాబాద్ కూడా తెలంగాణ సరిహద్దే. ఇప్పటికి మహారాష్ట్రలో నిర్వహించిన మూడు సభలు… ఓ రకంగా నిజాం పాలనలో ఉన్నవే. సభల నిర్వహణ బాధ్యత… ఆదిలాబాద్ జిల్లా మంత్రులు , ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలోని శివారు ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. పైగా అక్కడ పెద్ద స్థాయిలో నగదు బదిలీ పథకాలు లేవు. పొరుగు ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఆకట్టుకుటాయని.. తాము బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఆ పథకాలన్నీ తమకూ వస్తాయన్న ఓ భావన వారికి కల్పిస్తున్నారు.
అందుకే భారీ ఎత్తున ఖర్చు పెట్టి పథకాల గురించి శివారు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ పథకాలను వివరించే ఏడు వీడియో స్క్రీన్ ప్రచార రథాలను ఇప్పటికే విస్తృతంగా తిప్పుతున్నారు. తెలంగాణ రూపురేఖలు మార్చిన వందలాది స్కీంల విశిష్టతను ఈ డిజిటల్ స్క్రీన్ ప్రచార రథాల ద్వారా మహారాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని వారి మద్దతు పొందుతామని అంటున్నారు. అయితే కేసీఆర్ ఇలా మహారాష్ట్రపైనే దృష్టి కేంద్రీకరించడానికి ప్రత్యేకమైన కారణం ఉందని.. ఎన్సీపీని దెబ్బకొట్టే టాస్క్ అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.