తెలంగాణ సీఎం కేసీఆర్… ఓ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపాలంటే.. చాలా సింపుల్ టెక్నిక్ ఎంచుకుంటారు. గతంలో రెవిన్యూ సంస్కరణలు తేవాలనుకున్నప్పుడు.. భూవివాదాన్ని పరిష్కరించుకోలేక.. అధికారుల చుట్టూ తిరగలేక సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి నేరుగా ఫోన్ చేసి…మాట్లాడారు. ఆ తర్వాత అది చాలా మార్పులకు కారణం అయింది. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు హఠాత్తుగా ఫోన్లు చేసి ఆశ్చర్యపరిచారు. తాజాగా.. సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామ సర్పంచ్ భాస్కర్‌కు ఫోన్ చేశారు. క్షేమ సమచారాలు అడిగారు. తర్వాత కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం గురించి చర్చించారు.
కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తానే వస్తున్నానని… గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాకు, నియోజకవర్గానికి, గ్రామానికి వస్తున్నని… వేడుక ధూంధాంగా చేసుకుందామన్నారు. 1500 మందితో భోజనాలు చేసుకుందామని అవసరమైన ఏర్పాట్లన్నీ చూడమని పురమాయించారు. అంతే కాదు.. ఇంకేమైనా అభివృద్ధి పనులు కావాలా అని అడిగారు. గ్రామపంచాయతీ భవనాన్ని మంజూరు చేయాలని సర్పంచ్ కోరగా.. గ్రామానికి వచ్చిన రోజునే.. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, రైతువేదిక నిర్మాణానికి భూమి పూజ చేద్దామని ప్రకటించేశారు. మరో ఐదారు కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు కూడా చేపడదామన్నారు. తర్వాత మరికొన్ని గ్రామాల సర్పంచ్‌లకు కూడా ఫోన్లు చేశారు.
కేసీఆర్.. ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. ఆ ఫలాలు ఇప్పుడు ప్రజల దగ్గరకు చేరుతున్నాయి. అలా చేరుతున్న సందర్భంలో తనదైన మార్క్.. ప్రజల మీద పడాలంటే.. కేసీఆర్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ ను కలకలం గుర్తు పెట్టుకునేలా ప్రజలు ఉండేలా.. సింపుల్‌గా ఆ ప్రయత్నాలు ఉంటాయి. నేరుగా వారితో కలిసి.. పండగ చేసుకోవడం అందులో ఒకటి. అందుకే.. కేసీఆర్ లాంటి రాజకీయం…. ఇంకెవరూ చేయలేరు. మంచి చేస్తారు.. దానికి తగ్గట్లుగా పేరూ తెచ్చుకుంటారు..!