ఎమ్మెల్సీ ఎన్నికల్లో లభించిన విజయంతో కేసీఆర్… అటా.. ఇటా అన్న మీమాంసను వదిలేశారు. మళ్లీ ఎప్పట్లాగే ఫటాఫట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాగార్జున సాగర్ బైపోల్లో… మరణించిన నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కే టిక్కెట్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నల్లగొండ పార్టీ వర్గాలకు సమాచారం పంపినట్లు టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. నోముల భగత్‌కు పార్టీ నేతల సహకారం కూడా ప్రారంభమయింది. ఆయన ప్రచారానికి.. నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ.. నోముల భగత్‌ను కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే గెలవడం లేదన్న సెంటిమెంట్ ఇటీవలి కాలంలో తెలంగాణలో ఏర్పడింది.
మరణం వచ్చే ఉపఎన్నికల్లో కుటుంబసభ్యులెవరూ గెలవడం లేదు. అయితే అది అన్ని సార్లు వర్కవుట్ కాదని.. కేసీఆర్ కు ఇప్పుడు బలమైన నమ్మకం ఏర్పడింది. అదే సమయంలో.. సాగర్ టిక్కెట్ బీసీలకే ఇద్దామనుకున్నారు. రెడ్డి సామాజికవర్గానికి వారు పోటీపడినప్పటికీ.. బీసీల టిక్కెట్ బీసీలకే ఇద్దామని డిసైడయ్యారు. ఓ వైపు కాంగ్రెస్ తరపున జానారెడ్డి బరిలో ఉండటంతో అదే సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వడం కరెక్ట్ కాదని డిసైడయ్యారు. సాగర్ నియోజకవర్గంలో అత్యధికం యాదవ సామాజికవర్గానికి చెందినవే. ఆ సామాజికవర్గానికి చెందిన ఇతర పార్టీ నేతలు ఎవరూ బలవంతులు కాదు.
వారు పార్టీకి భారంగా మారతారు కానీ… పార్టీకి వారి బలం ప్లస్ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు వరకూ కేసీఆర్‌కు ధైర్యం లేకపోయింది. ఇప్పుడు మాత్రం.. ఆయన ఒకే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో నోముల కుమారుడికి టిక్కెట్ ఖరారయింది. దీనిపై టీఆర్ఎస్లో అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితి కూడా లేదు. మొత్తానికి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు… కేసీఆర్ స్ట్రాటజీని ఒక్క సారిగా మార్చేసిందని అనుకోవచ్చు.