దుబ్బాక ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేసీఆర్.. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడైపోయిందని తేల్చారు. దుబ్బాక ఎన్నికలు మాకు పెద్ద లెక్కే కాదని..మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ చిల్లర తతంగాలుగా తేల్చారు. ఎన్నికలు జరిగే వరకూ నడుస్తూనే ఉంటాయని వాటిని పట్టించుకోబోమని తేల్చేశారు. గ్రౌండ్ చాలా క్లియర్గా ఉందన్నారు. అయితే దుబ్బాకలో ప్రచారం హోరెత్తిపోతోంది.
బీజేపీ దూకుడు మీద ఉంది. బీజేపీలో గుర్తింపు ఉన్న ప్రతీ నేతా దుబ్బాకలో తిరిగేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రెండు రోజుల పాటు పర్యటించబోతున్నారు. దుబ్బాకలో డబ్బులు దొరకడం.. ఇతర అంశాలు వివాదాస్పదం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకుంది. ప్రత్యేకంగా పరిశీలకుడ్ని పంపించింది. కేంద్ర బలగాలు కూడా దుబ్బాకకు చేరుకున్నాయి. ఎన్నికల సమయంలో… అధికార అండతో టీఆర్ఎస్ అక్రమాలకు చేయకుండా ఉండటానికి కేంద్రంలో తమకు ఉన్న అధికారంతో బీజేపీ ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిస్థితి రాను రాను ఉద్రిక్తతంగా మారుతోంది. మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరి ప్రచారం వారు జోరుగా చేసుకుంటున్నారు. కానీ బయట మాత్రం సీన్లో బీజేపీ, టీఆర్ఎస్ మాత్రమే కనిపిస్తున్నాయి. కేసీఆర్ పూర్తి ధీమాతో ఉన్నందున… ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. ఫలితం ఎలా ఉన్నా.. మొత్తంగా హరీష్ రావే బాధ్యత వహించాల్సి ఉంటుంది.