బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు, మూడు రోజులుగా సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలన్నీ అభ్యర్థుల ఖరారుకేనని బీఆర్ఎస్ వర్గాలు తేల్చి చెబుతున్నారు. దాదాపుగా అన్ని అభ్యర్థుల్ని ఖరారు చేశారని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు ఉంటాయా లేదా అన్న సంగతి పక్కన పెట్టినా .. నవంబర్ , డిసెంబర్లో జరగనున్న ఎన్నికల కోసం అయినా ఇప్పటికే అభ్యర్థులపై ఓ అవగాహనకు రావాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఎక్కడెక్కడ కొత్త వారికివ్వాలో లిస్ట్ తయారు చేసి.. సామర్థ్యం ఉన్న నేతలకు ఇక నుంచి సంకేతాలివ్వనున్నట్లుగా తెలుస్తోంది.
సిట్టింగ్లు అందరికీ సీట్లిస్తామని కేసీఆర్ చెప్పినప్పిటికీ కొంత మందికి మొండి చేయి చూపించక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకూ చేయించిన సర్వేల్లో గట్టి పోటీ ఉన్నట్లుగా తేలిన నియోజవకర్గాలపై కేసీఆర్ స్వయంగా కసరత్తు చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి వేర్వేరు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి సాధ్యమైనంత త్వరలో పంపించాలని నిర్ణయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సీటు పక్కా అన్న అభ్యర్థులతో త్వరలోనే కేటీఆర్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.
పార్లమెంట్ కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తుకు వెళ్లినా వెళ్లకపోయినా తప్పదు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణ చేయాలంటే.. మూడో సారి గెలిచి తీరాలి. ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరిగితే.. ముందస్తు ఏం కాదనే వాదన కేసీఆర్ వినిపిస్తారు. ఆ ప్రకారం రెండు, మూడు నెలల్లో జరగాల్సి ఉన్న కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చకూడా నడుస్తోంది. గతంలో అసెంబ్లీని రద్దు చేసిన రోజే అభ్యర్థుల్నిప్రకటించారు. ఈ సారి కూడా అలా జరిగే అవకాశం ఉంది.