హుజూరాబాద్ విషయం తెలంగాణ రాష్ట్ర సమితి హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిలా మారిన సూచనలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఈటల రాజేందర్ బలమైన నాయకుడిగా అక్కడ ఉన్నప్పుడు ఆయనను ఢీకొట్టడానికి సరైన ప్రత్యర్థిని ఎంత వేగంగా ఎంపిక చేస్తే అంత మంచిదని రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న కేసీఆర్‌కు ప్రత్యేకంగా ఎవరో చెప్పాల్సిన పని లేదు. కానీ ఎందుకనో కానీ కేసీఆర్.. అభ్యర్థి ఎంపిక ప్రక్రియను క్లిష్టతరం చేసుకుంటూ పోతున్నారు. రోజుకొక అభ్యర్థిని తెరపైకి తీసుకు వస్తున్నారు. దీంతో.. టీఆర్ఎస్ శ్రేణుల్లోనే కంగారు ప్రారంభమయింది. ఇప్పటికే.. ఈటల మధ్య.. పార్టీ హైకమాండ్ మధ్య హుజూరాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు నలిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారి నాయకుడెవరన్న అంశంపై కేసీఆర్ గందరగోళం సృష్టించడం వారికి ఇబ్బందికరంగా మారింది.
ఈటలను పార్టీ నుంచి బయటకు పంపాలని డిసైడయిన తర్వాత హూజూరాబాద్ అభ్యర్థిగా టీఆర్ఎస్ చాలా మంది పేర్లను ప్రచారంలోకి పెట్టింది. అనూహ్యంగా వారెవరూ టీఆర్ఎస్ నేతలు కాదు. మొదటగా బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి పేరు వినిపించింది. ఆయన కేసీఆర్‌ను కలిశారని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వ్యూహంలో భాగంగనే ఆయన సొంత పార్టీపై అసంతృప్తి గళం వినిపించారని చెప్పుకున్నారు. ఆ తర్వాత సైలెంటయిపోయారు. తర్వాత కౌశిక్ రెడ్డి పేరు కూడా వినిపించింది. ఆయన ఈటలపై దూకుడుగా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆయన పేరు కూడా వెనుకబడిపోయింది. మధ్యలో హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న టీడీపీ నేత ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబీకులను పార్టీలో చేర్చుకున్నారు. వారికే టిక్కెట్ అని ప్రచారం ప్రారంభించారు.
తాజాగా ఎల్.రమణను పార్టీలో చేర్చుకుని ఆయనకే హుజూరాబాద్ టిక్కెట్ అని కూడా చెప్పడం ప్రారంభించారు. తాజాగా.. మరోసారి కౌశిక్ రెడ్డి పేరును తెరపైకి తీసుకు వచ్చారు. ఆయన ఫోన్ ఆడియో.. బయటపడటం టీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. ఇప్పుడు పదవికి రాజీనామా చేసి… కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యలో టీఆర్ఎస్ అభ్యర్థి అంటూ.. కొంత మంది అధికారుల పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇంత మంది అభ్యర్థులను కేసీఆర్ ఎందుకు రెడీ చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఈటలను వ్యూహాత్మకంగా బయటకు పంపినా.. ఆయనను ఎదుర్కొనే విషయంలో కేసీఆర్.. అంత కాన్ఫిడెంట్‌గా లేరని… హుజూరాబాద్ విషయంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే ఎవరికైనా అనిపించవచ్చు. అధికారపరంగా కూడా జిల్లాను చేస్తామని .. మండలాలు ఇస్తామని హామీ లు ఇస్తున్నారు. ఇదంతా.. టీఆర్ఎస్ గందరగోళానికి నిదర్శనమని ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి హుజూరాబాద్ విషయంలో టీఆర్ఎస్ గందరగోళం.. వ్యూహాత్మకమా..లేకపోతే నిజంగానే తేల్చుకోలేకపోతున్నారా.. అన్నది సీక్రెట్టే.