అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ముందు తక్షణం యాభై వేల ఉద్యోగాల భర్తీకి చర్యలుతీసుకోవాలని ఆదేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మరోసారి హుజూరాబాద్ ఉపఎన్నికలకు ముందు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగ ఖాళీల భర్తీపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి భేటీ జరిగింది. తొలి దశలో అన్ని శాఖల్లో కలిపి 50వేల ఉద్యోగాల భర్తీ చేయాలని.. రెండో దశలో ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీల భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు. నూతన జోనల్ విధానానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదించినందున.. భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ప్రకటనపై నిరుద్యోగులు నమ్మకం పెట్టుకోలేకపోయారు.
అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటం.. వెంటనే నాగార్జున సాగర్ ఉపఎన్నిక రావడం.. మినీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంతో… ఆ ఉద్యోగాల ఆశ చూపి.. మొత్తం ఎన్నికలను ఈదేశారన్న విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే ఈటల ఇష్యూ వచ్చే వరకూ ఉద్యోగాల భర్తీపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. డిమాండ్లు వచ్చినప్పుడల్లా.. త్వరలో త్వరలో అని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక రావడంతో.. మళ్లీ ఉద్యోగాల భర్తీపై కదలిక వచ్చింది.
అయితే.. ఇప్పుడైనా భర్తీ పూర్తవుతుందా.. మధ్యలో ఆగిపోతుందా.. లేకపోతే అసలు ప్రారంభమే కాదా అన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. అయితే.. నిరుద్యోగుల్లో మాత్రం మళ్లీ ఆశలు చిగురించడం ఖాయం. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఉద్యోగాల ఆశతో కోచింగ్ సెంటర్లకే పరిమితమైన లక్షల మంది నిరుద్యోగులు మళ్లీ ఆశపడతారు. వారికి నోటిఫికేషన్లు అందుతాయా.. ఈ లోపు ఉపఎన్నిల నోటిఫికేషన్ వచ్చి అడ్డం పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.!