ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలకు దిగారు. ఏ స్థాయిలో అంటే… ఫెడరల్ ఫ్రెంట్ స్థాపించుకొచ్చేస్తా అంటూ వెళ్లిన పర్యటన వైఫల్యం వైపు ప్రజల దృష్టిని మళ్లనంతగా! ఆ దిశగా మీడియా విశ్లేషణలు చేసేందుకు ఆస్కారం లేనంతగా! కేసీఆర్ ఢిల్లీ బయల్దేరే ముందు ఏం చెప్పారు… తనకు హిందీ బాగా వస్తదనీ, ఇక దేశమ్మీదికి బయల్దేరుతా అన్నారు. అన్నట్టుగానే, రాష్ట్ర రాజకీయాలకు వదిలేసి, మంత్రి వర్గ విస్తరణను కూడా పక్కనపెట్టేసి… ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా ఢిల్లీ వెళ్లొచ్చారు. కేసీఆర్ చెబుతున్న కాంగ్రెసేతర, భాజపాయేతర అజెండాకు మద్దతుగా నవీన్ పట్నాయక్ మాట్లాడలేదు, మమతా బెనర్జీ కనీసం నోరు విప్పలేదు! అఖిలేష్ యాదవ్ కలవలేదు, మాయావతితో భేటీ కుదరలేదు.
లోక్ సభ ఎన్నికల ముందు వివిధ రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలు… హఠాత్తుగా కేసీఆర్ అజెండాను తలకెత్తుకుని, ఆయనకు మద్దతుగా వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది..? ఎన్నికల తరువాతి పరిస్థితులపై ఎవరి ఆశ వారిది, ఎవరి అంచనా వారిది. ప్రస్తుత పరిస్థితులేవీ కేసీఆర్ చెబుతున్న మూడో ఫ్రెండ్ మోడల్ కూర్పునకు అనుకూలంగా లేవన్నది వాస్తవం. అయితే, ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయానికి అనుగుణంగా ఈ పరిస్థితి ఉందన్నదీ అంతే వాస్తవం. కాంగ్రెస్, భాజపాల పాత్ర లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వమూ ఏర్పడదనీ, ప్రజలను గందరగోళ పరచేందుకే కేసీఆర్ బయల్దేరి వెళ్తున్నారంటూ ఈ మధ్యనే చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్ బయల్దేరకముందు ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాలు ఎక్కడున్నాయో, ఇప్పుడూ అక్కడే ఉన్నాయి.
దానివైపుగా మీడియాగానీ, ప్రజలుగానీ ఆలోచించకుండా ఉండాలంటే… మొత్తంగా ఒక డైవర్షన్ అవసరం! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేస్తే… చర్చంతా అటు వెళ్లిపోతుంది. పైగా, కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయత్నాలకు, కచ్చితంగా చంద్రబాబు గండి కొడతారన్నది ఆయన విశ్వాసంగా కనిపిస్తోంది. గతంలో, ఢిల్లీలో తానేదో చక్రం తిప్పా అంటూ చంద్రబాబు చెప్పుకోవడం మీడియా మేనేజ్మెంట్ అని కేసీఆర్ చెబుతున్నా… వాస్తవం ఆయనకీ తెలుసు. చంద్రబాబు నాయుడి అనుభవంతో పోల్చితే, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ది కచ్చితంగా కొత్త ముఖమే. భాజపాయేతర పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబు బయల్దేరితే స్పందించే పార్టీలకూ… భాజపా, కాంగ్రెస్ లను కాదంటూ కేసీఆర్ పిలుస్తున్న తీరుకు పార్టీల నుంచీ వచ్చిన స్పందనకూ ఉన్న తేడా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ పై ఈ కోణంలో చర్చే జరిగేది. కానీ, దాన్ని పక్కతోవ పట్టించే విధంగా ఆయన వ్యవహరించారు.