దేశంలోనే ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో ప్రగతి నివేదన సభ ఉంటుందని తెరాస నేతలు చెబుతున్నారు. రేపు జరగబోతున్న సభకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ పెరుగుతోంది. దీన్ని మరింత పెంచేలా ఉంది క్యాబినెట్ భేటీ నిర్ణయం! కొంగర కలాన్ సభకు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు మంత్రివర్గ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో అసెంబ్లీ రద్దు తీర్మానమే మంత్రి వర్గ భేటీలో కీలకం కాబోతోందా అనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. ప్రగతి నివేదన సభకు రెండు గంటల ముందు వరకూ మంత్రి వర్గ భేటీ ఉండొచ్చని తెరాస వర్గాలు అంటున్నాయి. ఆ తరువాత, ముఖ్యమంత్రి ప్రత్యేక హెలీకాప్టర్ లో సభా వేదికకు చివరి నిమిషంలో చేరుకుంటారని సమాచారం.
మంత్రి వర్గ భేటీ ముగియగానే గవర్నర్ నర్సింహన్ ను కేసీఆర్ కలుసుకుంటారనీ అంటున్నారు. అంటే, ఒకవేళ అసెంబ్లీ రద్దు తీర్మానం చేస్తే… దాన్ని గవర్నర్ కు అందించేసి, అట్నుంచి అటే సభకు వచ్చి, తాము ఎన్నికలకు వెళ్తున్నామనే మెరుపు ప్రకటన చేయాలన్న వ్యూహంతోనే ఈ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనే అభిప్రాయం తెరాస వర్గాల నుంచి వినిపిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాంలతోపాటు తెలంగాణకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటే అసెంబ్లీ రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచనలు అందాయని కూడా చెబుతున్నారు.
ఏదేమైనా, అసెంబ్లీ రద్దుకి సంబంధించి ఒక్క ముఖ్యమంత్రికి తప్ప, తెరాసలో మంత్రులకీ నేతలకీ కూడా ఏమీ తెలీదన్నది వాస్తవం. అంతేకాదు, ప్రగతి నివేదన సభకు కొన్ని గంటల ముందు నిర్వహించే మంత్రి వర్గ భేటీలో అసెంబ్లీ రద్దు అంశం ఉంటుందా అనేది కూడా మంత్రులకీ తెలియని పరిస్థితి..! మొత్తానికి, ముందస్తు ఎన్నికల అంశమై చాలా గోప్యత మెంటెయిన్ చేస్తూ, ఉత్కంఠ పెంచుతూ, అసెంబ్లీ రద్దు అంశాన్ని ఒక బ్యాంగ్ మాదిరిగా, ఒక సక్సెస్ మాదిరిగా భారీ ఎత్తున ప్రకటించాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.