కేసీఆర్ తగ్గాలనుకోవడం లేదు. జాతీయ పార్టీని ప్రకటించాలని నిర్ణయించారు. గతంలో టీఆర్ఎస్ మాదిరిగా బీఆర్ఎస్ .. అంటే భారత రాష్ట్ర సమితి ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారని ప్రకటించారు. వారి కోరిక మేరకు భారత రాష్ట్ర సమితిని ఢిల్లీ వేదికగా ప్రకటించాలని నిర్ణయించారు. శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు స్పష్టత నిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పినప్పటికీ.. నెలాఖరులో ఢిల్లీలో పార్టీ ప్రకటన ఉంటుందని సూచన ప్రాయంగా కేసీఆర్ వివరించారు.
కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాల కోసమే సమయం కేటాయిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ, పాలనా వ్యవహారాలన్నింటినీ కేటీఆర్ చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే భారత రాష్ట్ర సమితి ఏర్పాటుకు బ్యాక్ గ్రౌండ్ ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. జూన్ రెండో తేదీన దేశంలోని అన్ని దినపత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. ముందుగా మీడియా ఫ్రెండ్లీగా మారి.. ఆ తర్వాత పార్టీ ప్రకటన చేయడం ద్వారా బాగా కవరేజీ పొందవచ్చని నిర్ణయించుకున్నారు.
అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహం అవలంభించబోతున్నారన్నదానిపై స్పష్టత లేదు. ఆయన గతంలో ప్రత్యేకంగా అన్నా హజారే లాంటి అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నారు. కానీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారన్నదానిపై స్పష్టత లేదు. రాజకీయపార్టీ ప్రకటించగానే్ రాష్ట్రపతి ఎన్నికల్లో సంచలనం సృష్టించేందుకు కేసీఆర్ ప్రయత్నించే అవకాశం ఉంది.