తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. పెండింగ్‌లో ఉన్న పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దానం నాగేందర్‌కు ఎట్టకేలకు.. ఖైరతాబాద్ టిక్కెట్ కేటాయించారు. మేడ్చల్ నుంచి ఎంపీ చామకూర మల్లారెడ్డి, గోషామహల్ నుంచి ప్రేమ్‌సింగ్ రాథోడ్, చార్మినార్ నుంచి మహ్మద్ సలావుద్దీన్ లోడీ, వరంగల్ తూర్పు నుంచి నన్నపనేని నరేందర్, హుజూర్నగర్ నుంటి శానంపూడి సైదిరెడ్డి, వికారాబాద్ నుంచి మెతుకు ఆనంద్, అంబర్‌పేట నుంచి కార్పొరేటర్ కాలేరు వెంకటేశ్, మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండి నుంచి సొంకె రవిశంకర్ లకు టిక్కెట్ ఖరారు చేశారు. మరో రెండు నియోజకవర్గాలు కోదాడ, ముషీరాబాద్ అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టారు.
పెండింగ్‌లో నియోజకవర్గాల విషయంలో.. కేసీఆర్ ఎలాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోలేదు. రెండు నెలలుగా పెండింగ్‌లో పెట్టి.. ఎవరికైతే టిక్కెట్ ఇవ్వాలనుకున్నారో వారికే ఇచ్చారు. చొప్పదండి తాజామాజీ ఎమ్మెల్యే బొడిగే శోభకు టిక్కెట్ నిరాకరిచిన కేసీఆర్… ఆమె అసహనానికి గురై.. బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారని మీడియాలో ప్రచారం కాగానే… అక్కడ అభ్యర్థిగా సుంకె రవిశంకర్ ను ప్రకటించారు. వరంగల్ తూర్పు నుంచి చాలా మంది పోటీ పడుతున్నా.. మేయర్ నన్నపునేని నరేందర్ పేరునే ఖరారు చేశారు. మేడ్చల్ తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పార్టీ పదవి ఇచ్చి పక్కన పెట్టారు. ఎంపీ మల్లారెడ్డికి.. ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. అయితే.. ప్రకటించిన టిక్కెట్లలన్నింటిలోకెల్లా వివాదాస్పదం అయ్యే సీటు… హుజూర్ నగర్. అక్కడ తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని… అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ డిమాండ్ చేస్తున్నారు. తనకు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారు. తనకు ఇవ్వకపోయినా పర్వా లేదు కానీ.. సైదిరెడ్డి అనే ఎన్నారైకు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేసీఆర్… ఆ సైదిరెడ్డికే టిక్కెట్ ఖరారు చేశారు. ఇప్పుడు.. శంకరమ్మ స్పందన ఎలా ఉంటుందోనని టీఆర్ఎస్ వర్గాలు టెన్షన్లో ఉన్నాయ.
పెండింగ్‌లో ఉన్న రెండు సీట్లలో.. ముషీరాబాద్ ఒకటి. ఇక్కడ నాయిని నర్సింహారెడ్డి అల్లుడు టిక్కెట్ డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు ఇవ్వకపోతే..తనకు ఇవ్వాలని… నాయిని కోరుతున్నారు. కానీ.. కేసీఆర్ మాత్రం ముఠా గోపాల్ అనే నేత వైపు మొగ్గు చూపుతున్నారు. అభ్యర్థిని ప్రకటిస్తే నాయిని నర్సింహారెడ్డి ఏం రాజకీయ రచ్చ చేస్తారోనని…. వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ముఠా గోపాల్ కు ఇప్పటికే క్లియరెన్స్ ఇవ్వడంతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇక కోదాడ విషయంలో.. కేసీఆర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అక్కడ శశిధర్‌రెడ్డి- వేనేపల్లి చందర్రావు మధ్య టికెట్ పోటీ నెలకొంది. చందర్ రావుకు టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నా.. ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. జాబితా మొత్తం మీద… మరో మహిళకు చోటు దక్కలేదు. మొత్తం నలుగురు మహిళలు మాత్రమే… టీఆర్ఎస్ అభ్యర్థులుగాఉన్నారు.