తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్థానం అయింది. తమ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదించారు.
కర్నాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్ నేత హెడీ కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్తో పాటు ఎంపీలు భేటీకి హాజరయ్యారు.ప్రస్తుతం జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో సభ్యులకు కేసీఆర్ వివరించారు. అనంతరం టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత సంతకాలు చేశారు.
అయితే కార్యవర్గ సమావేశంలో తీర్మానం మాత్రమే చేశారు. ఈసీ ఆమోదించాల్సి ఉంది. ఈ తీర్మానంతో .. టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి ఎన్నికలసంఘం ప్రతినిధులతో భేటీ అవుతుంది. వారికి సమర్పించి తెలంగాణ రాష్ట్ర సమితిపేరును రద్దు చేయించి.. భారత రాష్ట్ర సమితిగా మార్పు చేయిస్తారు. ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారికంగా ఉంటుంది.