ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని ఏపీ నుంచి తన లక్ష ఫోన్లు వచ్చాయని… తెంలగాణ అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాని .. అక్కడి ప్రజలు ఏపీ రాజకీయాల్లో కలుగుజేసుకోవాలని అడుగుతున్నారని ప్రకటించుకున్నారు. దేశరాజకీయాలను మార్చే క్రమంలో ఏపీ రాజకీయాలను మారుస్తామన్నారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని జర్నలిస్టులను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు తెలంగాణ వచ్చి పనిచేశారు..మేం వెళ్లి పనిచేయాలా వద్దా? అని ప్రశ్నించారు. తమకు చంద్రబాబు గిఫ్ట్ ఇచ్చారని… మేం రిటర్న్‌గిఫ్ట్ ఇస్తామన్నారు. మా గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు.
సచివాలయానికి వెళ్లరన్న విమర్శలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం ఎక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు.. సీఎం ఏం చేశారన్నదే జనానికి ముఖ్యమన్నారు. సీఎం ఎక్కడ ఉంటే.. అక్కడ సచివాలం ఉన్నట్లేనని ప్రకిటంచారు. తెలంగాణపై ఢిల్లీ పెత్తనమేందని ప్రశ్నించారు. విద్య,వైద్యం, వ్యవసాయం ఢిల్లీ చేతుల్లో ఎందుకని ప్రశ్నించారు. రాజ్యాంగంలో 50 శాతం రిజర్వేషన్లే ఇవ్వాలని లేదని… రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు తెలివి తక్కువ తీర్పు ఇచ్చిందన్నారు. రాజ్యాగంలో ఉమ్మడి జాబితా ఉండకూడదనిన్నారు. ఇంత పెద్ద దేశానికి ఒక్క సుప్రీంకోర్టా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు అధికారాల్ని పరిమితం చేయాలన్నారు. విజయం ఎంత గర్వంగా ఉందో…బాధ్యత అంతే బరువుగా ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పూర్తి కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. గిరిజనులు, గిరిజనేతరుల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని.. ఉద్యోగ ఖాళీల భర్తీని వేగవంతం చేస్తామన్నారు. దళితులు, గిరిజనుల పేదరికాన్ని నిర్మూలిస్తామని రెడ్డి, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఉదయం మమతాబెనర్జీ, జాతీయ నేతలు మాట్లాడారని.. తాము దేశానికి దిక్సూచిగా ఉంటామన్నారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పాలన రావాలని ఆకాంక్షించారు. దీనికి తెలంగాణ ఫలితాలు నాంది పలికాయన్నారు. నాలుగు పార్టీలను ఒక చోటుకు చేర్చి.. భుజాలు రాసుకోవడం కాదు కావాల్సిందని చంద్రబాబు ఫ్రంట్ ప్రయత్నాలను విమర్శించారు. మైనార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అసదుద్దీన్ తాను.. దేశమంతా పర్యటిస్తామన్నారు. హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసుకున్నామని ప్రకటించారు. వచ్చే నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు చూస్తారని ప్రకటించారు. రేపు ఉ.11.30కి టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుందని.. అందులో తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.