ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ మీద ఇవాళ్ల స్పష్టత వస్తుందనీ, రేపే బయల్దేరి వెళ్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మోడీతోపాటు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఇతర శాఖల మంత్రులతో భేటీ కావాలని కేసీఆర్ షెడ్యూల్ వేసుకున్నారు. ఈ పర్యటన ముఖ్యోద్దేశం… కేంద్రం ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలంటూ కోరడం. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలను ఇవ్వాలంటూ ప్రధానిని కోరనున్నారు. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి, ఆ మేరకు లోటును కేంద్రమే భరించాలని జీఎస్టీ చట్టంలో ఉంది. ఆ లెక్కన రూ. 1719 కోట్లు కేంద్రం ఇవ్వాలనే డిమాండ్ కూడా చేయబోతున్నారు.
పన్నుల వాటా, జీఎస్టీ బకాయిల అంశాన్ని తెరాస ఎంపీలు పార్లమెంటులో కూడా ప్రస్థావించారు. అంతేకాదు, ప్లకార్డులు పట్టుకుని, ఉభయ సభల్లో తీవ్ర నిరసన తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలో భాజపా సర్కారుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కూడా చేశారు. భాజపాకి వ్యతిరేకంగా తెరాస సభ్యులు నిరసన ఇదే ప్రథమం. గత సమావేశాల్లో ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు బిల్లులకు తెరాస మద్దతు ఇచ్చింది. సమాచార హక్కు సవరణ బిల్లు సమయంలో కూడా తెరాస మద్దతుగా నిలిచింది. కానీ, ఈ సమావేశాలకు వచ్చేసరికి… సిటిజన్ షిఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించాలని తెరాస విప్ జారీ చేసింది. కేసీఆర్ 2.0 ప్రభుత్వానికి ఏడాదైంది. భాజపాతో సంబంధాల అంశంలో అంతలోనే ఎంతో మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో భాజపా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. దాన్ని ఇప్పట్నుంచే ఎదుర్కోవాలంటే భాజపాని వ్యతిరేకించాల్సిన అవసరం కేసీఆర్ కి ఏర్పడింది.
భాజపాతో సంబంధాలు ఇలా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. గతంలో చేసిన పర్యటనలు, ప్రధానితోపాటు కేంద్ర పెద్దలతో భేటీలన్నీ ఒకలా కనిపిస్తే… ఇప్పుడు మరొలా ఉండే అవకాశం ఉంది. పన్నుల వాటాలు ఇవ్వాలి, జీఎస్టీ పరిహారం భరించాలనే డిమాండ్లు వినేందుకు ప్రధానమంత్రి ఎంతవరకూ సుముఖంగా ఉన్నారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమే కదా! రాష్ట్రం వెనకబాటుకు కేంద్రంలోని భాజపా కారణమని కేసీఆర్ విమర్శలు చేశారు. ఇప్పుడు భాజపా కూడా తెలంగాణకు ఏం చేసిందో స్పందించాల్సిన అవసరం ఉంది కదా. మొత్తానికి, అపాయింట్మెంట్ ఖరారైతే రేపటి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా కొంత ఆసక్తికరంగా మారుతుంది.