తెలంగాణ సీఎం కేసీఆర్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన చేపట్టిన వెనుక కీలక రాజకీయ పరిణామాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యే చాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీతో ఆయన సమావేశం కాలేదు. ఎదురుపడే సందర్భం వచ్చినా పట్టించుకోలేదు. ఈ కారణంగా ఆయనతో గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. బీజేపీని టార్గెట్ చేసుకున్న క్రమంలో మోదీపైనే కేసీఆర్ ప్రధానంగా విరుచుకుపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అయితే అది రాజకీయంగా కలకలమే అవుతుంది. నిజానికి విపక్ష ముఖ్యమంత్రులు ప్రధానిని కలవడం సహజమే. రాజకీయంగా ఎంత విభేదాలున్నా.. ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ అయ్యేది రాజకీయంకోసం మాత్రమే కాదు.. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించడానికి కలవవచ్చు. అయితే ఇలాంటి భేటీలను కూడా రాజకీయంతో ముడి పెట్టుకోడవమే కాదు.. చాలా మంది సీఎంలు రాజకీయ వ్యవహారాలపై చర్చకే ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా.. మోదీతో విపక్ష సీఎంల భేటీలు తగ్గిపోతున్నాయి.
కేసీఆర్ మరీ దూకుడుగా మోదీపై విరుచుకుపడటంతో సీన్ మారిపోయింది. వివిధ అంశాలపై కేంద్రానిదే తప్పని నిరూపించేందుకు తెలంగాణ సర్కార్ అవాస్తవాలను కూడా ప్రచారం చేసిందని బీజేపీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మోదీతో భేటీ అయితే..ఆయన రాజీ ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న చర్చ ఊపందుకుంటుంది. అలాంటి చర్చ జరగాలనుకుంటే కేసీఆర్ కూడా ప్రయత్నిస్తారు. లేదంటే.. మరోసారి అక్కడ అన్ని విపక్ష పార్టీలతో మరోసారి కీలక భేటీలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనే విపక్షాల ఐక్యత తేలిపోయినందున కేసీఆర్ కూడా పెద్దగా నమ్మకం పెట్టుకోరన్న వాదన వినిపిస్తోంది.