రెండో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న కేసీఆర్…ప్రతిపక్ష పార్టీలు నోరెత్తితే … సంగతి చూస్తాననే రీతిలో హెచ్చరికలు ముందస్తుగానే జారీ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్న దొంగల భరతం పడతానని, వారి నుంచి మింగిన సొమ్మును కక్కిస్తానని స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఎందుకు చేయలేదో.. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో… రాజకీయాల్లో అందరికీ తెలుసు. ఆయన దృష్టి ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే ఉంది. వైఎస్ హయాంలో హౌసింగ్ మినిస్టర్ గా ఉత్తమ్ అవినీతికి పాల్పడ్డారనేది కేసీఆర్ వాదన. పలు ప్రచార సభల్లో కూడా.. ఇదే చెప్పి.. తాను రాగానే ఉత్తమ్‌ను జైలుకు పంపుతానని కూడా ప్రకటించారు.
రెండో సారి గెలిచిన తర్వాత తన మాటల్లో పదజాలం మరింతగా పరుషంగా మార్చారు. ఎవరు పడితే వాళ్లు కుక్కలు మొరిగినట్టు మొరిగితే ఊరుకోం. దానికి ట్రీట్మెంట్ తప్పనిసరిగా ఉంటుందని హెచ్చరించారు. దొంగల భరతం పడతామన్నారు. ఎవడెవడు ఏం మేసిండో అన్నీ తెలుసు. వాటిని కక్కిస్తాం. ఓటుకు నోటు విచారణ కూడా జరుగుతోందని హెచ్చరికలు పంపారు. తన చర్యలు అప్రజాస్వామికంగా ఉంటాయనే చెప్పుకొచ్చారు. తాను కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాననని..అది మీకు అప్రజాస్వామికం అనిపిస్తే నేనేం చేయలేనని తేల్చి చెప్పేశారు. ఓ రకంగా కేసీఆర్…తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఆశలు వదులు కోాల్సిందేనని హెచ్చరికలు పంపారు.
దీనికి రియాక్షన్ కూడా వెంటనే వచ్చేసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మనుషుల అక్రమ రవాణా కేసులో ఎన్నికలకు ముందు జైలుకెళ్లిన..సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.. తాను నాలుగేళ్లు కేసీఆర్ పై, ఆయన కుటుంబంబై విమర్శలు చేయబోనని ప్రకటించారు. కావాలంటే.. ఆయనతో యాభై సార్లు భేటీ అయి… నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానంటున్నారు. అసలే కాంగ్రెస్‌లో గెలిచిన సీనియర్లు తక్కువ. ఉత్తమ్, భట్టి, శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి లాంటి సీనియర్లు గెలిచారు. కేసీఆర్ హెచ్చరికలతో వీరు ఎంత మంది కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడతారన్నది ఆనుమానాస్పదంగానే ఉంది. కేసీఆర్ ఏం చేసినా… తమకు మద్దతిచ్చే వారు ఎవరూ ఉండరన్న భావనకు లోనైతే… వీరు కూడా సైలెంట్ కావొచ్చు. మొత్తానికి తెలంగాణలో ప్రతిపక్షం… ఉన్న లేనట్లేనన్న భావన తీసుకు రావడానికి కేసీఆర్ అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు ..!