మళ్లీ ఇంటికో ఉద్యోగాల టాపిక్ వచ్చింది! తెలంగాణ వస్తే ఇంటికో కొలువు వస్తుందని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా కథనాలు, వార్తలు చాలా ఉన్నాయి. అయితే, అలా తాను చెప్పలేదని గతంలో ఓసారి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే మాట అసెంబ్లీలో మరోసారి చెప్పారు. వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా గోల్ మాల్ చేస్తే వచ్చేది ఏందని సభలో మాట్లాడుతూ ఓ సందర్భంలో కేసీఆర్ చెప్పారు. ఇవ్వలేని ఉద్యోగాలను ఇస్తామని భ్రమించేలా చేసి ప్రభుత్వం ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు! పొరపాటున కూడా నేను ఆ మాట చెప్పలేదు అధ్యక్ష్యా అన్నారు.
తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఆ మాట చెప్పలేదనీ, వాస్తవ పరిస్థితులు తనకు తెలుసు కాబట్టి ఆ మాట మాట్లాడలేదన్నారు ముఖ్యమంత్రి. బాగా ఆలోచించాను కాబట్టే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పలేదన్నారు. అయితే, ఒక మాట తాను చెప్పాననీ… ఇతర ప్రాంతాల ఉద్యోగులు మన హక్కుల్ని హరించారు కాబట్టి, మన రాష్ట్రం మనకు వస్తే లక్షమందికి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పాను అన్నారు. చెప్పినట్టుగానే ఇప్పుడు దొరుకుతున్నాయన్నారు. ఇప్పటికే యాభై అరవైవేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇంకా కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయన్నారు. ఎన్నెన్ని ఉద్యోగాలు వచ్చాయో సభకు లెక్కలు ఇస్తానన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మా మేనిఫెస్టోలో ఉందా అని ప్రశ్నించారు. నేను చెప్పినట్టు స్పీచ్ ఉందా, వాగ్దానం చేసినట్టు ఆధారాలున్నాయా అన్నారు!!
పొరపాటున కూడా ఆ మాట చెప్పలేదని కేసీఆర్ ఇప్పుడు అంటున్నారు! కానీ, యూట్యూబ్ లో ఆ మాటల వీడియోలు దర్శమిస్తాయి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తానని మనవి చేసుకుంటా అంటూ కేసీఆర్ మాటలున్నాయి. ప్రతీ ఇంటికొక ఉద్యోగం వస్తది అని గట్టిగా చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఠాట్… అలా అన్లేదు, అన్నట్టు చూపిస్తారా అని ముఖ్యమంత్రి పదేపదే మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? అయినా ఎందుకీ చర్చ..? ప్రతీ ఇంట్లో ఒకరికి ఏదో ఒక మార్గంలో ఉపాధి కల్పించే ప్రయత్నం చేశామనండీ, అదీ ఉద్యోగమే కదా అంటూ తిప్పి చెప్పండి తప్పేముంది? అంతెందుకు… ఈ టాపిక్ తెర మీదికి తీసుకురాకండి, ఏ గొడవా ఉండదు!