తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన్ సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు.ఇప్పుడున్నదాని వాస్తు సరిగ్గా లేదంటూ దాన్ని కూల్చివేయాలని నిర్ణయించారట ,ప్రజా సౌకర్యం కోసం, ఆధునిక సదుపాయాల కోసం నూతన నిర్మాణాలు మరమ్మత్తులు చేసుకోవడంలో తప్పులేదు. ఆ విధంగా చూసినా ఇప్పుడున్న తీవ్ర సమస్యల నేపథ్యంలో వున్న సచివాలయం కూల్చివేసి కొత్తది కట్టడం కన్నా ముఖ్యమైన తక్షణ సమస్యలు చాలా వున్నాయని కొంతమంది మంత్రులు కూడా అంటున్నారు. దాదాపు అన్ని ప్రతిపక్షాలే గాక జెఎసి చైర్మన్ కోదండరాం కూడా దీన్ని తప్పుపట్టారు. అయినా సరే కెసిఆర్ నిర్ణయం తీసుకున్నాక మారే అవకాశం చాలా తక్కువ. అందులోనూ నమ్మకాల సమస్యతో ముడిపెట్టారని ఆంధ్రజ్యోతిలో వచ్చిన వివరమైన కథనం సమగ్రంగా నివేదించింది. అయితే నిజాం నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి వరకూ ఈ వాస్తు దోషాల ఫలితాలను అనుభవించారని ఆయన భావించడం వాస్తవ చరిత్రకు అనుగుణంగా వుందా అంటే ఎంతమాత్రం లేదు. పాలకుల తప్పులు పొరబాట్లు వాటివల్ల వచ్చిన ప్రజల ఉద్యమాలతో జరిగిన పరిణామాలు అన్ని వాస్తు ఫలితంగా చూపడం అశాస్త్రీయమే కాదు, అర్థం లేని విషయం.
ఉదాహరణకు నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం ప్రజల చైతన్యం ఫలితమే. దేశంలోనే గాక ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆ విధమైన ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలు పెల్లుబుకాయి. . అయినా వాదనకోసం చెప్పాలంటే కేంద్రం చలవ వల్ల ఆయన రాజప్రముఖ్గానే దిగిపోయారు. ఆయన వారసులు ఆస్తిపాస్తులు అనుభవిస్తూనే వచ్చారు. ఇక హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావంతో సగౌరవంగా నిష్క్రమించారు. ఆపైన గవర్నర్‌గానూ పనిచేశారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,జలగం వెంగళరావు వంటి ముఖ్యమంత్రులు విపరీతమైన అధికారం చలాయించడమే గాక తర్వాత కేంద్రంలోనూ ఒక వెలుగు వెలిగారు. ఇక ఎన్టీఆర్ సంచలన చరిత్ర సృష్టించారు. వెన్నుపోటు పొడిస్తే దేశంలోనే ఎన్నడూ ఎరగని రీతిలో నెలరోజుల్లో మళ్లీ వచ్చేశారు. చంద్రబాబు నాయుడు ఎవరికన్నాఎక్కువ కాలం పాలించారు.హత్యాప్రయత్నం నుంచి ప్రాణాలతో బయిటపడి మళ్లీ ఇప్పుడు ఏపిని ఏలుతున్నారు. వైఎస్ఆర్ ఏకబిగిన ఎవరికంటే ఎక్కువ కాలం పాలించి తనదైన ముద్ర వేశారు. ఆయన మరణానంతరం రోశయ్య ఎవరూ అనుకోని రీతిలో ముఖ్యమంత్రి అయ్యారు. దిగిపోయాక గవర్నర్‌గా పూర్తికాలం పనిచేశారు. అంతకంటే అదృష్టవంతుడుగా కిరణ్‌కుమార్ రెడ్డి అల్లకల్లోలంలోనూ పదవీ కాలం సాగించుకున్నారు. ఇక పివి నరసింహారావు మర్రిచెన్నారెడ్డితో సహా అనేక మంది తమ తమ చేతలను బట్టి నేతలుగా వెలుగొందారు. ఇక్కడ దెబ్బ తిన్న పివి ప్రధాని అయితే చెన్నారెడ్డి రెండోసారి సిఎం అయ్యారు.
కాబట్టి వీరు అధికారంలోకి రావడంలోని విజయాన్ని వదలిపెట్టి పదవి పోయిన తీరునే గుర్తు పెట్టుకోవడం ఎలాటి తర్కం? అధిష్టానాల వల్లనో స్యీయ తప్పిదాల వల్లనో ఆ ముఖ్యమంత్రులు దిగిపోతే భవనాలేం చేశాయి? చివరి అయిదేళ్లు రోశయ్య కిరణ్‌ల కష్టాలను తెలంగాణ కోణంలో అనుకూల పరిణామమే కదా? కాబట్టి పైన చెప్పుకున్న జాబితాలో నాయకులంతా పదవులు పొందడం, మళ్లీ రావడం లేదా కొనసాగడం ఏవీ కీడును సూచించేవి కావు. అయినా సరే ఇలాంటి నమ్మకాలకు తర్కాలతో పనేముంది? నమ్మాల్సిందే. కాని ఇందుకోసం ప్రజా ధనం వందల కోట్లలో వెచ్చించడం దండగమారి పని కదా? అదైనా ఇంత ఆఘమేఘాల మీద చేయాల్సిన అవసరమేమిటి? డి బ్లాకును ఎల్అండ్ టి ఆధునికంగా నిర్మించడం మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే. వారసత్వ భవనాలను కూడా కూల్చేంత వాస్తు దృష్టి అనుచితం.వ్యక్తిగత విశ్వాసాలు పూజాపురస్కారాలు యజ్ఞయాగాలు ఆయన ఇస్టమే గాని ప్రభుత్వానికి కూడా దాన్ని ఆపాదించడం ఏ శాస్త్రం ఆమోదించని విపరీతం.
ఆ విషయం అలా వుంచితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేసి అట్టిపెట్టుకున్న భవనాలను అప్పగించేందుకు సిద్దంగానే వుందన్నది స్పష్టం. దీనిపై ఏదో లాంచనంగా చర్చలు తప్ప అడ్డుపడటం జరగదు. అయితే ఇందుకు మారుగా ఎపి కోరే కోర్కెలన్నీ ఆమోదం పొందకపోవచ్చు. 9,10 షెడ్యూళ్లకూ దీనికి సంబంధం పెట్టి ఏదో సాధిస్తామని చెప్పడం కూడా అవాస్తవికతే. నిజం ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతగా పట్టుపట్టే స్థితిలో లేదు. ఆ ఉద్దేశం కూడా లేదు. పట్టువిడుపులతో పరిష్కారం చేసుకోవడం ఎప్పుడూ మంచిదే గాని రాజకీయ అధినేతలుగా కెసిఆర్ చంద్రబాబు ముఖాముఖి చర్చించి పారదర్శకంగా ప్రకటన చేస్తే సుహృద్భావం పెరుగుతుంది. స్పష్టతా వస్తుంది. కావాలంటే గవర్నర్ నరసింహన్‌కు కూడా ఆ సన్నివేశంలో పాత్ర కల్పించవచ్చు. అంతేగాని ఆయన ద్వారా దాగుడుమూతలు లీకింగులు బ్రేకింగులు ఎందుకు?