ఎర్రబెల్లి దయాకరరావు తెలుగుదేశం మీద ప్రేమతో.. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయినట్లుగా చెప్పుకున్నారు. కానీ అక్కడ ఆ పార్టీలో మాత్రం ఆయనకు అంత ప్రేమాస్పదమైన ఆహ్వానం లభిస్తున్నట్లు లేదు. ఎర్రబెల్లి చేరిక ద్వారా వచ్చే లుకలుకలు ఇప్పట్లో సమసిపోయే వాతావరణం కూడా కనిపించడం లేదు. ఆయన చేరికకు సంబంధించి గులాబీ పార్టీలో ఇలాంటి అసంతృప్తులు చాలా ముందునుంచి వినిపిస్తూనే ఉన్నాయి. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో.. ఆ అసంతృప్తులకు సంబంధించి రుజువులు కూడా బయటపడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు పార్టీలో ఎర్రబెల్లి దూకుడుకు కేసీఆర్ కూడా పెద్దగా సహకరించడం లేదని ఇప్పుడు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
తెదేపా ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి కేసీఆర్‌ను కలిసి తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్న తర్వాత.. ఆ ప్రకటన చేశారు. ఆ సందర్భంలో తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్నాం అని.. నిజాం మైదానంలో గానీ, వరంగల్లోగానీ ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి.. అధికారికంగా కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతాం అని అప్పట్లో ఎర్రబెల్లి మీడియా ముందు ప్రకటించారు.
అయితే తన చేరిక అనేది ఒక బిగ్‌బ్యాంగ్ లాగా ఉండాలని ఎర్రబెల్లి సరదా పడడంలో తప్పులేదు. ఆ కోరికకు మాత్రం గులాబీ బాస్ నో చెప్పారని సమాచారం. ఎర్రబెల్లి తన బల ప్రదర్శన కోసమే భారీ బహిరంగసభ ప్లాన్చేస్తున్నారనే అనుమానం ఉన్న వరంగల్ జిల్లా లోని ఆయన సొంత పార్టీ ప్రత్యర్థులు కేసీఆర్ వద్ద పుల్లలు వేశారుట. దాంతో భారీ కార్యక్రమం పెట్టి చేరాలనుకున్న ఎర్రబెల్లి కోరికకు కేసీఆర్ బ్రేకులేశారు. ఇక తప్పదు గనుక.. ఆయన గుట్టుచప్పుడు కాకుండా.. అనుకున్నంత హడావుడి లేకుండా కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ప్రకాశ్‌గౌడ్ కూడా ఒకటోతేదీన కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.