తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకులకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఇటీవలి కాలంలో కేసీఆర్ రాజ్‌భవన్‌తో పూర్తిగా దూరం పాటిస్తున్న సందర్భంలో గవర్నర్ స్వయంగా చొరవ తీసుకుని ఉగాది వేడుకలు ఏర్పాటు చేసి.. కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు. ఉగాది రోజే అయితే..ప్రగతి భవన్లో వేడుకలు ఉంటాయి కాబట్టి కేసీఆర్ హాజరు కారేమోనని ఒక రోజు ముందుగానే నిర్వహించారు. కేసీఆర్ వస్తారని దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేశారు.
కేసీఆర్‌తో పాటు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు.. ప్రతిపక్ష నేతలకు కూడా ఆహ్వానం పంపారు. అయితే.. కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. చివరిక్షణం వరకూ ఎదురు చూసిన గవర్నర్ వేడుకలను నిర్వహించేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పెద్దగా హాజరు కాలేదు. సీఎం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఎక్కువ మంది దూరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డితోపాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇతరులు హాజరయ్యారు.
కేసీఆర్ ఓ సారి కాదు అనుకుంటే మరోసారి దగ్గరకు తీసుకునే చాన్స్ లేదని గతంలో చాలా సార్లు రుజువు అయింది. మరోసారి చినజీయర్‌తోపాటు గవర్నర్ విషయంలోనూ అదే జరుగుతోంది. గవర్నర్ బెంగాల్ తరహాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ.. ఆమె విషయంలో కేసీఆర్ కఠినంగా ఉంటున్నారు. ఇక ముందు కేసీఆర్ ఇలాగే ఉంటారని.. గవర్నర్‌తో సత్సంబంధాలు అనే ప్రశ్నే ఉండదని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.