మునుగోడు ఉపఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం లేనట్లేనని టీఆర్ఎస్ వర్గాలు నిర్ణయానికి వచ్చేశాయి. కేటీఆర్ మాత్రం సమయం కేటాయించి రెండు విడతలుగా ప్రచారం చేయనున్నారు. ఉపఎన్నికలు ఖాయమని తెలిసిన తర్వాత కేసీఆర్ఓ బహిరంగసభలో ప్రసంగించారు. ఇప్పుడు పార్టీ నేతలు రెండు బహిరంగసభలకు ప్లాన్ చేసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మునుగోడులో విస్తృత ప్రచారం చేయనున్నారు. శుక్రవారం ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.
ఇటీవల ఉపఎన్నికల్లో కేటీఆర్ పెద్దగా ప్రచారం చేయలేదు. దుబ్బాకతో పాటు తాను సిట్టింగ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో వచ్చిన ఉన్న హూజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన ఉపఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. మొత్తం బాధ్యతలను హరీష్ రావే చూసుకున్నారు. కానీ మునుగోడు విషయంలో మాత్రం ఆయన రంగంలోకి దిగారు. కేసీఆర్ ప్రచారానికి రావడం లేదని.. అదుకే కేటీఆర్ రంగంలోకి దిగారన్న అభిప్రాయం టీఆర్ఎస్లో వినిపిస్తోంది.
ఉపఎన్నికల్లో సాధారణంగా కేసీఆర్ ప్రచారం చేయరు. అధికార పార్టీగా ఉండి ఉపఎన్నికల్లో ఓడిపోతే ఓ సమస్య .. సీఎం ప్రచారం చేసి మరీ ఓడిపోతే మరో సమస్య. అందుకే కేసీఆర్ దూరంగా ఉంటారని చెబుతారు. అయితే పార్టీకి చేదు ఫలితం వస్తే.. కేసీఆర్ బహిరంగసభ నిర్వహిస్తే.. ప్రచారం చేస్తే ఫలితం వేరేగా ఉండేదన్న విశ్లేషణలు వస్తాయి. దుబ్బాకలో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పుడు ఇదే చెప్పుకున్నారు. మరి చాన్సివ్వకూడదని చివరి రోజు అయినా కేసీఆర్ బహిరంగసభలో ప్రసంగిస్తారో లేదో చూడాలి