భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా… తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం.. కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీజేపీయేతర కూటమి పార్టీలన్నింటినీ ఆమె ఈ ర్యాలీకి ఆహ్వానించారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి.. కోల్కతా ర్యాలీకి ఆహ్వానించారు. దాదాపుగా… అన్ని పార్టీల నేతలు వస్తున్నారు. బీజేపీయేతర , కాంగ్రెసేతర కూటమిగా .. ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు.. ఆహ్వానం అందినప్పటికీ.. ఆయన హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ తరపున మల్లిఖార్జన్ ఖర్గే హాజరవుతున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు… కూడా వెళ్తున్నారు. దీంతో.. మమతా బెనర్జీ ర్యాలీకి దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి కాంగ్రెస్ పార్టీ కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేదు. అయితే… ఆమె కాంగ్రెస్ కన్నా ఎక్కువగా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేకంగా కూటమి ర్యాలీగా కాకుండా.. యునైటెడ్ ఇండియా పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా.. కాంగ్రెస్ కూటమిలో ఉన్న వాళ్లు, లేని వాళ్లు కూడా వస్తున్నారు. అందరి ప్రాతిపదిక … బీజేపీ వ్యతిరేకతనే. అయినా సరే.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మాత్రం… ఈ ర్యాలీకి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా.. కేసీఆర్ రెండు సార్లు మమతా బెనర్జీతో సమావేశం అయ్యారు. అయినప్పటికీ.. ఆమె స్వయంగా ఫోన్ చేసినప్పటికీ.. ఆమె నిర్వహిస్తున్న ర్యాలీకి కేసీఆర్ వెళ్లకూడదని నిర్ణయించుకోవడంపై రాజకీయవర్గాల్లో పలు రకాల చర్చలకు కారణం అవుతోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోల్ కతా ర్యాలీ కోసం.. ఒక రోజు ముందుగానే వెళ్తున్నారు. శనివారం ఉదయం 9 గం.ల నుంచి 12 గం.ల వరకు.. కోల్కతాలోని తాజ్ బెంగాల్ హోటల్లో పలు జాతీయ పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశం అవుతారు. జాతీయ రాజకీయాలు, బీజేపీయేతర పక్షాల ఐక్యత వంటి అంశాలపై చర్చిస్తారు. చంద్రబాబుతో పలువురు నేతలు కూడా వెళ్లనున్నారు. బీజేపీయేతర కూటమి విషయంలో… చంద్రబాబు… చర్చలు కీలకమయ్యే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ ర్యాలీకి .. బీజేపీ మిత్రపక్షాలు మినహా.. అన్ని పార్టీలు హాజరవుతున్నాయి. జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండే ఒడిషా అధికార పార్టీ .. బిజూ జనతాదళ్ మాత్రం.. ఏ కూటమి వైపు ఉండటం లేదు.