తెలంగాణ శాసనసభ చర్చల్లో కేసిఆర్ చాలా ప్రశ్నలకు సూటిగానే జవాబు చెప్పేసారు. ” డబుల్ బెడ్ రూము ఇళ్ళు ఈ అయిదేళ్ళలో కడతామని చెప్పలేదు. నీటి ప్రాజెక్టులు కూడా అయిదేళ్ళలో కావు. ప్రణాళికలో చెప్పడమంటే ఒక పాలనా కాలంలో చేస్తామని కాదు” అని తేల్చిపారేశారు. అసలు నియోజకవర్గానికి వంద డబుల్ బెడ్ రూము ఇల్లు అనడంలోనే చాలా అర్థం ఉంది. ఆ లెక్కన అర్హులందరికీ రావడానికి 20,30 ఏళ్ళు కూడా సరిపోక పోవచ్చు. కానీ షో కేసింగ్ జరుగుతుంటుంది.
ప్రజలు షరా మాములుగా ఆశలు భ్రమలు పెంచుకుని ధరఖాస్తులతో తిరుగుతుంటారు. నమ్మితే వోట్లు కూడా వేస్తారు. పథకాలు పట్టి నిలుపుతుంటాయి అంతే. ఇక ప్రాజెక్టుల ఎత్తుపై 148 అడుగులకు తగ్గిస్తామని ఎవరు చెప్పారని నిలదీసిన నాలుగు రోజులకే మహారాష్ట్రతో అవగాహనా చర్చలు జరిపారు. దీనిపై గట్టిగా అడిగే పరిస్తితి ప్రతిపక్షాలకు లేదు కనుక ఇలాగ జరిగి పోతున్నది.ఇప్పటికి కేసిఆర్ మాటే శాసనం గనక, కొత్త రాష్ట్రమనే వాదన ఉంది గనుక ఆయన మాటలు ఆలకించక తప్పదు.
రాష్ట్రం కొత్తదైనా పాలకులు పాత రాజకీయాలు తెలియని వాళ్ళా ? అప్పుడు లేని వాళ్ళా భాగం కానివాళ్ళా ? విభజన , కొత్త పేరు తప్ప ఎత్తుగడలు,వ్యూహాలు అన్నీ ఎప్పుడూ చూస్తున్నవే కదా? నిజానికి పదవులలో చేరిన నేతలు కూడా పాత వాళ్ళే కదా ! ఉద్యమం నిజమే కానీ జేఎసి కి కూడా మంగళం పాడేసారే? ఏది కొత్త అనుకోవాలి ? కోదండరాం ఇప్పుడు ఎలాటి పిలుపునిస్తారో చూడాలి. రాష్ట్రాల సరిహద్దులు మారాయి గాని రాజకీయ బుద్ధులు మారాయా ఆర్థిక హద్దులు పోయాయా పెత్తనాలు తొలగాయా ? అనేది అనుభవమే చెబుతుంది. తెలంగాణలో మంచి జరగాలని కోరుకుంటూనే విమర్శనాత్మకం గా ఉండక తప్పదు మరి. వీటన్నిటికంటే ఆందోళన కలిగించేది అప్పులు విపరీతంగా తేవడం. ఇది గుదిబండగా మారే ప్రమాదం చాలా ఉంది.