తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో వెలుగులోకి వస్తున్న విషయాలు, పోలీసు అధికారులు వెల్లడిస్తున్న నిజాలు చూస్తే.. దేశంలో అత్యంత దారుణమైన రాజకీయ నేతల్లో ఒకరిగా కేసీఆర్ మిగిలిపోతారు. ఇంకా కేసీఆర్ భాషలో చెప్పాలంటే.. డర్టీయెస్ట్ పొలిటీషియన్ అవుతారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎవర్నీ వదల్లేదు. సొంత కుటుంబసభ్యులనూ వదల్లేదని తెలుస్తోంది. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో కానీ.. అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు ఆయన పయనించిన అడ్డదారులు ఆయన రాజకీయ జీవితానికి ఘోరమైన ముగింపు దిశగా పయనించేలా చేస్తున్నాయి.
అధికారం ఉందని హద్దు దాటడం డర్టీనే !
అధికారాన్ని బాధ్యతగా భావిస్తే జరిగే పరిణామాలు వేరు… అధికారాన్ని అహంకారంగా మార్చుకుంటే జరిగే పరిణామాలు వేరు. ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది. తమకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు అంటే.. ముందుగా వారి ఫోన్లలో దూరిపోవాల్సిందేనని ఆదేశాలు వెళ్తున్నాయి. వారి వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం… బ్లాక్ మెయిల్ చేయడం కామన్ అయిపోయాయి. అయితే సైలెంట్ అవ్వాలి లేకపోతే బీఆర్ఎస్లో చేరి బానిసగా మారాలన్నట్లుగా రాజకీయం చేశారు. ఇంత కంటే డర్టీ పాలిటిక్స్ ఎక్కడైనా ఉంటాయా ?
ట్యాపింగ్లతో బెదిరింపులు డర్టీ మాఫియా !
తెలంగాణలో ప్రముఖ వ్యాపారవేత్త సంధ్యా శ్రీధర్ రావు. ఆయనపై గతంలో వరుస కేసులు నమోదయ్యాయి. ఎలా అంటే.. ఆయన స్వలింగ సంపర్కుడని కూడా ప్రచారం చేశారు. ఎందుకు అంటే.. ట్యాపింగ్ ద్వారా కనిపెట్టి.. బీఆర్ఎస్కు రూ. పదమూడు కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనాలని హుకుం జారీ చేశారు. ఆయన తాను కొనేది లేదని స్పష్టం చేశారు. దాంతో డర్టీ మాఫియా విరుచుకుపడింది. ఆయన పరువును బజారున పడేసేలా చేసింది. ఇటీవల సంధ్యా శ్రీధర్ రావు తాను ఎదుర్కొన్న ఘోరమైన పరిస్థితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బయటపడాల్సినవి ఇంకెన్ని ఉన్నాయో ?
రాజకీయాల్లో కొన్ని విలువలు పాటించాలి. లేకపోతే తాము చేసిందే తమ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నవారు.. అధికారంలో ఉన్న వారు.. ఆ విలువల్ని దిగజార్చకూడదు. అధికారం ఉందని తాము ఏం చేసినా చెల్లుతుందని డర్టీ పనులు చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా ఇరుక్కుపోతారు. ప్రస్తుతం కేసీఆర్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆయన నిర్వాకాలు ఇంకా ముందు ముందు ఎన్ని ఎన్ని బయట పడతాయో కానీ… ప్రజలంతా కేసీఆర్ ఇంత డర్టీ పొలిటీషియనా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి రావొచ్చు.