తెలంగాణ సీఎం కేసీఆర్ సాధారణంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వరు. మంత్రులే ఆయనను కలవలేరు. కేసీఆర్ అనుకుంటే తప్ప కలవడం అసాధ్యం. కానీ ప్రకాష్ రాజ్‌కు మాత్రం ఎప్పుడు అంటే అప్పుడు కేసీఆర్‌తో ఎంట్రీ లభిస్తోంది. తాజాగా ఆయన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లిన ప్రకాష్ రాజ్ దాదాపుగా నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. ఇక్కడ అసలు ట్విస్టేమిటంటే అక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. పీకేతో చర్చల్లో ప్రకాష్ రాజ్ కూడా కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా జాతీయ రాజకీయాలపైనే చర్చించారు. యూపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి.. జాతీయ రాజకీయాల్లో అందరూ ఏ క తాటిపైకి రావాలంటే ఏం చేయాలి వంటివాటిపై చర్చించారు.
అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో ఇతర పార్టీలను ఏకం చేసేలా సమన్వయ బాధ్యతలను టీఆర్ఎస్ తరపున.. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ తరపున తీసుకోవాల్సిన బాధ్యతలపై ప్రకాష్ రాజ్‌కు కేసీఆర్ వివరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో పీకే పూర్తిగా ప్రకాష్ రాజ్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ఎలాంటి వ్యూహాలు అవలంభించాలన్నదానిపై కేసీఆర్ , ప్రశాంత్ కిషోర్ లు ప్రకాష్ రాజ్ కు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ముఖ్య సమన్వయకర్తగా ప్రకాష్ రాజ్ ఉండటం ఖాయమైపోయిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి టీఆర్ఎస్లో ఢిల్లీ వ్యవహారాల్ని చక్కబెట్టడానికి చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా బోయిన్ పల్లి వినోద్ కుమార్ వంటి సన్నిహితులు చాలా మంది ఉన్నారు. కానీ వారినందర్నీ కాదని కేసీఆర్ ప్రకాష్ రాజ్ ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఆయన వద్ద ఏం ఉంది… కేసీఆర్ ఎందుకు ప్రకాష్ రాజ్ పై ఆసక్తి చూపిస్తున్నారనేది టీఆర్ఎస్ నేతలకూ అర్థం కావడం లేదు. కొసమెరుపేమిటంటే.., ఎర్రవల్లిలో భేటీతర్వతా గజ్వేల్ అభివృద్ధిని చూడాలని ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్‌లకు కేసీఆర్ సూచించారు. అంతే అధికారులు దగ్గర ఉండి.. గజ్వేల్ అభివృద్ధిని వారికి చూపించారు. ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ డైరక్ట్‌గా సమావేశమైన విషయం మొదటి సారి ఇప్పుడే బయటపడింది.